Pawan Kalyan: ఎన్నికల యుద్ధానికి పవన్ కల్యాణ్ సిద్ధం.. ఇక్కడి నుంచే శ్రీకారం..
- IndiaGlitz, [Tuesday,February 13 2024]
ఎన్నికల కురుక్షేత్రానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సిద్ధమయ్యారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేష్ ఎన్నికల బరిలో దిగారు. 'రా..కదిలిరా' సభలతో చంద్రబాబు జనాల్లోకి వెళ్తుండగా.. 'శంఖారావం' పేరుతో చినబాబు ప్రచారం చేస్తున్నారు. తాజాగా సేనాని కూడా జిల్లాల పర్యటనకు రెడీ అయ్యారు. ప్రతి జిల్లాలో మూడు సార్లు పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా రూపొందించారు. ఇందుకోసం ప్రత్యేక హెలికాఫ్టర్ కూడా సిద్ధం చేశారు. 175 నియోజకవర్గాల్లో హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం అనువైన ప్రదేశాలను ఇప్పటికే గుర్తించారు.
ఈ పర్యటనలకు హెలికాప్టర్లో వెళ్లి.. రాత్రికి తిరిగి మంగళగిరి పార్టీ కార్యాలయంకు చేరుకునేలా షెడ్యూల్ రూపొందించారట. పార్టీ నుంచి పోటీ చేసే టికెట్ల విషయంపై ముఖ్య నేతలతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబుతో చర్చలు జరిపేందుకు అందుబాటులో ఉండేలా పర్యటనలను ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే మొదట జిల్లా ముఖ్యనేతలతో సమీక్షలు, తర్వాత పర్యటనల్లో బహిరంగసభల్లో పాల్గొననున్నారు. ముందుగా ఉభయగోదావరి జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
రేపు(బుధవారం)భీమవరంలో పశ్చిమ గోదావరి జిల్లా నాయకులతో, 15న అమలాపురంలో, 16న కాకినాడలో సమీక్షలు చేయనున్నారు. ఇక ఈనెల 17వ తేదీన రాజమండ్రిలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అవుతారు. అయితే భీమవరం నుంచే తన పర్యటన ప్రారంభించనుండటంపై సర్వతా ఆసక్తి నెలకొంది. మరోసారి అక్కడి నుంచే పోటీ చేయబోతున్నారన్న ప్రచారం జోరందుకుంది. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ భీమవరం నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ నుంచి పోటీ చేసిన గ్రంధి శ్రీనివాస్.. పవన్‌ను ఓడించి విజయం సాధించారు.
ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్‌కు 70,642 ఓట్లు, పవన్‌కు 62,285 ఓట్లు, టీడీపీ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులుకు 54,037 ఓట్లు వచ్చాయి. దీంతో 8,357 ఓట్ల తేడాతో పవన్ ఓటమి చెందారు. ఈ ముగ్గురు కాపు సామాజిక వర్గానికి చెందినవారే కావడం విశేషం. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ-జనసేన విడివిడిగా పోటీ చేయడంతో ఓట్లు చీలాయంటున్నారు. ఈసారి కలిసి పోటీ చేయనుండటంతో ఇక్కడ గెలవడం సులభమని లెక్కలు వేసుకుంటున్నారు జనసైనికులు. మరోవైపు కాకినాడ ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారనే చర్చ కూడా జరుగుతుంది. మరి ఏ నియోజకవర్గం నుంచి పవన్ పోటీ చేయనున్నారో మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది.