Pawan Kalyan: వైసీపీ కుట్రల్లో చిక్కుకోవద్దు.. కాపు పెద్దలకు పవన్ కల్యాణ్‌ విజ్ఞప్తి

  • IndiaGlitz, [Friday,January 05 2024]

కాపు పెద్దలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) బహిరంగ లేఖ రాశారు. వైసీపీకి ఓటమి కళ్లెదుట కనిపిస్తోందని.. అందుకే కొందరు కాపు పెద్దలను రెచ్చగొడుతోందని లేఖలో పేర్కొన్నారు. కాపులకు రిజర్వేషన్ ఇచ్చేది లేదని కరాఖండీగా చెప్పి కాపులనే పావులుగా వాడుకునే వ్యక్తిని ముందుగా ప్రశ్నించాలి అని సూచించారు. కుట్రలు, కుయుక్తులతో అల్లిన వైసీపీ వలలో చిక్కుకోవద్దని విన్నవించారు. తాను గౌరవించే కాపు పెద్దలు తనను తిట్టినా దీవెనలుగానే భావిస్తాను అని.. తనను ఎంతగా దూషించినా వారికి జనసేన పార్టీ వాకిలి తెరిచే ఉంటుందని వెల్లడించారు.

లేఖలో ఏయే అంశాలు పేర్కొన్నారంటే..

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఓటమి అనివార్యమని స్పష్టంగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తాము వైసీపీని సాగనంపుతున్నామని సర్వేల ద్వారా వెల్లడిస్తూనే ఉన్నారు. ఎమర్జెన్సీ సమయంలో అప్పటి పాలక పక్షాన్ని నిలువరించి దేశ ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చాయి. అదే రీతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అని ప్రకటించి నేను మొదలుపెట్టిన ఒక కార్యాచరణ వైసీపీకీ, ఆ పార్టీని నడిపే నాయకుడికీ కంటగింపుగా మారింది. అసభ్యకర దూషణలకి దిగి, వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డా తట్టుకొని నిలబడుతూనే ఉన్నాం.

అన్ని సామాజిక వర్గాల్లోనూ నిర్దిష్టమైన శాతం, కాపు సామాజిక వర్గంలో బలమైన శాతం జనసేనకు అండగా ఉండటం వైసీపీకి జీర్ణం కావడం లేదు. ఈ క్రమంలోనే కులపరమైన అస్త్రాన్ని వైసీపీ ప్రయోగిస్తోంది. అందులో భాగంగా నేను గౌరవించే కాపు పెద్దలను రెచ్చగొట్టి పార్టీని బలహీనపరచే దుష్ట ప్రయత్నాలకు ఒడిగడుతోంది. సదరు కాపు పెద్దలు ఆ విధంగా మాట్లాడటానికి వారి కారణాలు వారికి ఉండవచ్చు. వాటిని నేను సహృదయంతో అర్థం చేసుకోగలను. వారి దూషణలను నేను దీవెనలుగా తీసుకొంటాను అని తెలియచేస్తున్నాను.

రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను కాంక్షిస్తూ నేను తీసుకొనే నిర్ణయాలకు సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. జనసేన ఆవిర్భావం నుంచీ నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసమే అడుగులు వేస్తున్నాను అని అందరికీ తెలుసు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల సాధికారతతోపాటు, అగ్ర కులాల్లోని పేదలకు అండగా నిలిచి వారి ఆర్థిక ఉన్నతికి దోహదపడాలన్నదే నా ఉద్దేశం. కులాలను కలిపే ఆలోచనా విధానంతోనే అందరూ ఒక తాటిపైకి రాగలరని విశ్వసిస్తాను. అన్ని కులాలను కలుపుకొని అడుగులు వేసే సమర్థత కాపులకు ఉంది కాబట్టే పెద్దన్న పాత్ర తీసుకోవాలని కోరాను. అందుకు అనుగుణంగా కాపు యువత, మహిళలు, విజ్ఞులు నడుం బిగించారు.

రాబోయే ఎన్నికల్లో కాపులు కచ్చితంగా నిర్ణయాత్మక, క్రియాశీలక పాత్ర పోషిస్తారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించారు. కాబట్టే కాపులలో అంతర్గత విభేదాలు తీసుకువచ్చే క్రమంలోనే వైసీపీ కుట్రలకు తెర తీసింది. కొందరు కాపు పెద్దలను జనసేనపైకి ప్రయోగిస్తోంది. కాపు రిజర్వేషన్ పోరాటాన్ని హింసాత్మకంగా మార్చిన మాస్టర్ క్రిమినల్ బ్రెయిన్ ఆ తరవాత ఎటు మళ్లిందో కాపు సామాజిక వర్గం గ్రహించింది. కాపులకు రిజర్వేషన్ ఇచ్చేది లేదు అని కాపులకు బలమైన జిల్లా అని అందరూ భావించే తూర్పుగోదావరి వెళ్ళి జగ్గంపేటలో కరాఖండీగా ప్రకటించిన శ్రీ జగన్ రెడ్డిని కాపు పెద్దలు ప్రశ్నించాలి. కాపు కార్పొరేషన్ కి నిధులు కేటాయింపు ఏమైందో నిలదీయాలి. కాపులను కాపు నాయకులతో తిట్టిస్తూ, తూలనాడిస్తున్న వ్యక్తిని కాకుండా నన్ను దూషించడం వల్ల ఎవరికి ప్రయోజనమో గ్రహించాలి.

కుట్రలు, కుతంత్రాలతో అల్లిన వైసీపీ వలలో చిక్కుకోవద్దని నేను గౌరవించే కాపు పెద్దలకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. నన్ను దూషించే సదరు కాపు పెద్దలకు జనసేన పార్టీ వాకిలి ఎప్పుడూ తెరిచే ఉంటుందని తెలియచేస్తున్నాను. వైసీపీ ప్రాయోజిత విషపూరిత ప్రచారాలను, తప్పుడు అభిప్రాయాలతో కూడిన విశ్లేషణలు, వార్తలను విశ్వసించవద్దని కాపు సామాజిక వర్గంతోపాటు ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని ఆకాంక్షిస్తూనే నిర్ణయాలు తీసుకొంటాను అని తెలియచేసుకొంటున్నాను అని పవన్ స్పష్టం చేశారు.

More News

Yatra 2:నేను వైయస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డని.. 'యాత్ర 2' టీజర్ విడుదల..

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా 'యాత్ర' చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే.

Congress Party: ఎవరు చేరినా ఏపీలో కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేనట్లే..

స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన పార్టీ కాంగ్రెస్. ఒకప్పుడు ఆ పార్టీ చెప్పిందే వేదం.. చేసిందే చట్టం. దేశంలోని మెజార్టీ రాష్ట్రాల్లో అధికారంలో ఉండేది.

Buses:అద్దె బస్సుల ఓనర్లతో చర్చలు సఫలం.. రేపటి నుంచి యథావిధిగా బస్సులు..

అద్దె బస్సు యజమానులతో తెలంగాణ ఆర్టీసీ(TSRTC) ఎండీ సజ్జనార్(Sajjanar) జరిపిన చర్చలు ఫలించాయి.

Bandi Sanjay:ఎన్నికల సమయంలో బండి సంజయ్‌కు కీలక పదవి

లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. నరేంద్రమోదీ(PM Modi)ని మూడోసారి ప్రధానమంత్రిని చేయాలనే లక్ష్యంతో ఎన్నికల కోసం కసరత్తు సాగిస్తోంది.

YS Sharmila:రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వైయస్ షర్మిల

వైయస్ షర్మిల(YS Sharmila) కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge),