Janasena Party : అమ్మఒడి ఎగ్గొట్టడానికి.. బడులు మూసేస్తున్నారా : జగన్ పాలనపై నాగబాబు విమర్శలు
Send us your feedback to audioarticles@vaarta.com
అమ్మఒడి పథకం.. ఏపీలోని విద్యా వ్యవస్థపై జనసేన పీఏసీ సభ్యులు కొణిదెల నాగబాబు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ లో 8 వేలకుపైగా స్కూళ్లకు తాళాలు వేసి, భావి భారత పౌరులకు విద్యను దూరం చేస్తున్న ముద్దుల మామయ్య ఇలా ఎందుకు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అమ్మ ఒడి నుంచి తప్పించుకోవటానికా.. లేక అసలు ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా చెయ్యడానికా అని నాగబాబు దుయ్యబట్టారు.
ఒక్క అనంతపురం జిల్లాలోనే 711 పాఠశాలల మూసివేత:
ఒక్క అనంతపురం జిల్లాలోనే 711 స్కూళ్ళను మూసేసిన వైసీపీ ప్రభుత్వం అక్కడున్న చిన్నారుల భవిష్యత్తు ఏం చెయ్యాలని అనుకుంటోందని నాగబాబు మండిపడ్డారు. తమ బడి కోసం పిల్లలు పోరాటం చేస్తున్న తీరు, పిల్లలను రోడ్లపై కూర్చోపెట్టిన ఘన చరిత్ర వై.సీ.పీ. ప్రభుత్వానికే దక్కుతుందంటూ ఆయన చురకలు వేశారు. బహిరంగ వేదికలపై 'మాట తప్పం..' అనే ఊత పదాలతో జనాన్ని మభ్య పెడుతున్న వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలా మాట తప్పుతోందని నాగబాబు ఎద్దేవా చేశారు. ఉన్న బడులను మూసేసి, దూర ప్రాంతాలలో విలీనం చేసి, విద్యార్థులను రెండుమూడు కిలోమీటర్ల మేర నడిచి వెళ్లమని చెప్పటం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.
ఏపీలో పడిపోతున్న అక్షరాస్యత రేటు:
విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా చర్యలు చేపట్టి, అందుకు తగ్గట్టుగా ఉపాధ్యాయులను నియమించాలని నాగబాబు డిమాండ్ చేశారు. దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అక్షరాస్యత శాతం దిగువ స్థాయికి పడిపోవడానికి ప్రభుత్వ విధానాలే కారణమని ఆయన దుయ్యబట్టారు. ప్రతీ మారుమూల ప్రాంతాల చిన్నారులకు విద్యను అందించే ప్రణాళిక జనసేన వద్ద ఉందని నాగబాబు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చాక విద్యారంగంలో విప్లవాత్మకమైన అభివృద్ధి చేసి చూపుతామని ఆయన స్పష్టం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com