Janasena : అటకెక్కిన నవరత్నాలు.. పవన్ ప్రశ్నలకు సమాధానమేది: జగన్ ప్రభుత్వంపై నాగబాబు విమర్శలు

నవరత్న పథకాల అమలుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆ పార్టీ పీఏసీ సభ్యులు కొణిదెల నాగబాబు. జనసేన కేంద్ర కార్యాలయంలో కృష్ణా, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన పార్టీ శ్రేణులతో ఆయన భేటీ అయ్యారు. వైసీపీ ప్రభుత్వం నవరత్నాల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్న తీరును, ప్రజా ధనాన్ని దోచుకుంటున్న విధానాన్ని పార్టీ శ్రేణులు నాగబాబు గారి దృష్టికి తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. ప్రజలపై మోయలేని భారం వేస్తూ ..పన్నుల రూపంలో వచ్చే ఆదాయాన్ని దోచుకుంటున్న వైసీపీ ప్రభుత్వం పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని ఆయన నిలదీశారు.

జనసేన ప్రభుత్వంలో ప్రతి పేద కుటుంబానికి రూ.10 లక్షల సాయం:

ఎన్నికల సమయంలో వైసీపీ నాయకత్వం ఆచరణ సాధ్యం కాని హామీలను గుప్పించి ప్రజలను తప్పుదోవ పట్టించారని నాగబాబు మండిపడ్డారు. వారు ఇచ్చిన హామీలు నెరవేర్చడం సాధ్యం కాదని తెలిసి ఇప్పుడూ రకరకాల సాకులతో సాధారణ ప్రజలకు కూడా సంక్షేమ పథకాలు అందకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. జనసేన సంక్షేమ పథకాలకు ఎప్పుడూ వ్యతిరేకం కాదని, ప్రభుత్వ పథకాలు పాలకుల సంపాదన మార్గాలుగా మారకుండా ప్రతీ పేద కుటుంబానికి చేరాలి అనేది జనసేన లక్ష్యమన్నారు. అధికారంలోకి రాగానే ప్రతీ పేద కుటుంబానికి పది లక్షల రూపాయల విలువైన ప్రభుత్వ సహాయం అందజేసే బృహత్తర ప్రణాళిక జనసేన దగ్గర ఉందని నాగబాబు పేర్కొన్నారు. జనసేన పరిపాలనలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య బాధ్యతాయుతమైన వ్యవస్థ పని చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

పిల్లలను విద్యకు దూరం చేస్తున్న ‘‘ముద్దుల మామయ్య’’:

అంతకుముందు ఏపీలోని విద్యా వ్యవస్థపై నిన్న నాగబాబు స్పందిస్తూ.. 8 వేలకుపైగా స్కూళ్లకు తాళాలు వేసి, భావి భారత పౌరులకు విద్యను దూరం చేస్తున్న ముద్దుల మామయ్య ఇలా ఎందుకు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అమ్మ ఒడి నుంచి తప్పించుకోవటానికా.. లేక అసలు ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా చెయ్యడానికా అని నాగబాబు దుయ్యబట్టారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే 711 స్కూళ్ళను మూసేసిన వైసీపీ ప్రభుత్వం అక్కడున్న చిన్నారుల భవిష్యత్తు ఏం చెయ్యాలని అనుకుంటోందని నాగబాబు మండిపడ్డారు. తమ బడి కోసం పిల్లలు పోరాటం చేస్తున్న తీరు, పిల్లలను రోడ్లపై కూర్చోపెట్టిన ఘన చరిత్ర వై.సీ.పీ. ప్రభుత్వానికే దక్కుతుందంటూ ఆయన చురకలు వేశారు. బహిరంగ వేదికలపై 'మాట తప్పం..' అనే ఊత పదాలతో జనాన్ని మభ్య పెడుతున్న వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలా మాట తప్పుతోందని నాగబాబు ఎద్దేవా చేశారు.