Janasena Party : సమస్యలుంటే జనం చూపు ‘‘జనసేన’’ వైపే .. అండగా నిలుస్తాం : నాగబాబు

ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన ప్రధాన ధ్యేయమని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేసే వారిని, సమాజ శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరి సేవలను పార్టీ గౌరవిస్తుందన్నారు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణిదెల నాగబాబు . మంగళవారం హైదరాబాదులోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఉత్తరాంధ్రకు చెందిన విద్య, సామాజిక రంగ నిపుణులు నాగబాబుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ... జనసేన తీసుకుంటున్న సామాజిక బాధ్యతకు మద్దతు తెలుపుతూ పలువురు పార్టీ కార్యాలయానికి తరలి రావడం, జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపడం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు.

జనసేనను ఆశ్రయిస్తే సమస్య పరిష్కారమవుతుందని జనానికి నమ్మకం కుదిరింది:

రాష్ట్రంలో ఎక్కడ సమస్య నెలకొన్నా జనసేన వైపే జనం చూస్తున్నారని.. పార్టీ దృష్టికి తీసుకువెళ్తే సమస్య పరష్కారమవుతుందనే భావన ప్రజల్లో నెలకొందని నాగబాబు తెలిపారు. నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కార బాధ్యత జనసేన తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. జన సైనికులు, వీర మహిళలు, నాయకులు- సమస్యలతో వచ్చిన ప్రజలకు చేయూతనిచ్చి వారికి అండగా నిలవాలని నాగబాబు సూచించారు.

పవన్ జనవాణి కార్యక్రమానికి వెల్లువెత్తిన జనం

మరోవైపు.. ఆదివారం విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో జరిగిన జనవాణి కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జనసేనాని మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలో ప్రభుత్వం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమం విజయవంతం అయితే, మా వద్దకు అసలు సమస్యలు ఏవి రాకుండా ఉండాలి కదా అని పవన్ కల్యాణ్ నిలదీశారు. మొదటివారమే మొత్తం 427 మంది తమ సమస్యలను మా దృష్టికి తీసుకువచ్చారంటే అర్థం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు.

ప్రజాప్రతినిధులకు టైముంది బూతులు తిట్టడానికే:

క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందో ఇది చెబుతున్నట్లే కదా అని పవన్ కల్యాణ్ అన్నారు. 427 అర్జీలతో వచ్చినవారు బాధలతో, సమస్యలతో సతమతం అవుతున్న లక్షల మందికి ప్రతినిధులని ఆయన అభివర్ణించారు. మన ప్రజాప్రతినిధులకు ప్రజా సమస్యలపై తప్ప అన్ని విషయాల్లోనూ తీరిక ఉంటుందని.. పుట్టిన రోజు సంబరాలకు, సదస్సులకు, బూతులు తిట్టడానికి వారికి చాలా సమయం ఉంటుందంటూ పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. మనం అంతా ఏకమై ఈ ప్రభుత్వాన్ని నిలదీయకపోతే ఇంకా దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్తామని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.