nadendla manohar: ప్రభుత్వానికి వ్యతిరేకంగా 73 శాతం మంది... వైసీపీ ఇక ఇంటికే : నాదెండ్ల మనోహర్
Send us your feedback to audioarticles@vaarta.com
వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. గుంటూరు జిల్లా తెనాలిలో శుక్రవారం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. క్రియాశీలక సభ్యులను చేర్పించిన వాలంటీర్లను అభినందించి వారికి పార్టీ జెండాలు అందజేశారు మనోహర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వాన్ని.. పాలనను ప్రజానీకమంతా వ్యతిరేకిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా 73 శాతం మంది:
దాదాపు 73 శాతం ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయని మనోహర్ అన్నారు. ఈ ప్రభుత్వానికి ఎంతో సమయం లేదని.. ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించడానికి సిద్ధం కావాలని ఆయన శ్రేణులకు పిలుపునిచ్చారు. జనసేన ప్రభుత్వం తీసుకురావడానికి క్రియాశీలక సభ్యులు పార్టీ కోసం ప్రతి రోజూ గంట నుంచి రెండు గంటల పాటు కష్టపడాలని నాదెండ్ల మనోహర్ సూచించారు. ప్రతి క్రియాశీలక సభ్యుడు 50 మంది నుంచి వంద మందిని ప్రభావితం చేసేలా తయారు కావాలని దిశా నిర్దేశం చేశారు.
పెరుగుతోన్న జనసేన క్రియాశీలక సభ్యులు:
జనసేన పార్టీ రోజురోజుకు బలపడుతోందని.. 2019లో పార్టీ క్రియాశీలక సభ్యులను చేర్పించడానికి కేవలం 3253 మంది వాలంటీర్లు పని చేస్తే, ఇప్పుడు ఆ వాలంటీర్ల సంఖ్య 9700కి చేరుకుందని నాదెండ్ల అన్నారు. పార్టీ క్రియాశీలక సభ్యులు సంఖ్య 3.5 లక్షలకు చేరిందని.. జనసేన పార్టీ సభ్యత్వం నిజాయతీగా నిబద్ధతగా ఇస్తుందని ఆయన తెలిపారు. కొన్ని పార్టీలు చేపట్టే తూతూ మంత్రపు సభ్యత్వ నమోదు మన దగ్గర ఉండదని.. కొన్ని పార్టీలు మిస్డ్ కాల్ ఇస్తే సభ్యత్వం తీసుకుంటాయని, మరికొన్ని పార్టీలు పది రూపాయలకు సభ్యత్వం ఇస్తాయి. ఇంకొన్ని పార్టీలు విచిత్రంగా ఓటర్ల జాబితాలోని పేర్లను నమోదు చేసి సభ్యత్వాలు ఇస్తాయని నాదెండ్ల మనోహర్ వివరించారు.
సభ్యత్వ నమోదులో పూర్తి పారదర్శకత:
కానీ జనసేన పార్టీ ఈ విషయంలో ఎలాంటి తప్పుడు మార్గాలను ఎంచుకోదని... సభ్యత్వ నమోదులో పూర్తిస్థాయి పారదర్శకత పాటిస్తున్నామని పేర్కొన్నారు. 500 రూపాయలు ఇచ్చి పార్టీ సభ్యత్వం తీసుకునేందుకు చాలామంది ముందుకు వస్తున్నారని.. శ్రీకాకుళం లాంటి జిల్లాలో కొందరు ఫోన్లు చేసి పింఛను వచ్చేంతవరకూ సభ్యత్వ గడువును పెంచాలని కోరడం పార్టీకి పెరుగుతున్న జనాదరణకు నిదర్శనమన్నారు. వెయ్యికి పైగా సభ్యత్వాలను ఐదు మంది చేస్తే, 500 సభ్యత్వాలను 31 మంది.. 100 మందిని పార్టీలో చేర్చిన వారు చాలా మంది ఉన్నారని నాదెండ్ల అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments