Janasena : జనసేన జెండా చూస్తేనే వైసీపీ వణుకుతోంది.. దిమ్మెలు ధ్వంసం చేస్తే ఆగుతామా: నాదెండ్ల మనోహర్
- IndiaGlitz, [Saturday,September 03 2022]
విజయవాడలో జనసేన జెండా దిమ్మెలు ధ్వంసమైన ఘటనపై స్పందించారు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. జనసేన పార్టీ నిత్యం ప్రజలతో మమేకమవుతూ వారి పక్షాన పోరాడుతుంటే అధికార వైసీపీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని- విజయవాడలో రాయల్ హోటల్ సెంటర్లో పార్టీ జెండా ఎగురవేసేందుకు సిద్ధమైతే వైసీపీ వాళ్ళు అడ్డుకొని జెండా దిమ్మెను ధ్వంసం చేయడం పాలక పక్షం వైఖరిని తెలియచేస్తోందన్నారు.
జనసేన నాయకులపై కేసులు అప్రజాస్వామికం:
వైసీపీ దౌర్జన్యాన్ని అడ్డుకొన్నందుకు మా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన మహేష్, ఇతర నాయకులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. జనసేన జెండా దిమ్మెను పగలగొట్టినవారిపై కాకుండా, ఆ దుశ్చర్యను అడ్డుకొన్నవారినే పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్ళి కేసులుపెట్టడం ఏమిటని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ, ప్రజల ముందుకు వెళ్తున్నవారిని కట్టడి చేసేందుకే ఈ విధమైన కేసులు నమోదు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
జనసేన జెండా చూస్తేనే వణుకుతున్నారు :
జెండా దిమ్మెలు ధ్వంసం చేసినంత మాత్రాన జనసేన ప్రస్థానాన్ని ఆపలేరని అధికార పక్షం గ్రహించాలని మనోహర్ చురకలంటించారు. జనసేన జెండా చూస్తేనే భయపడి అక్కసుతో దాడి చేస్తున్నారని మరోసారి రుజువైందని నాదెండ్ల ఎద్దేవా చేశారు. మొన్న జగ్గయ్యపేటలో, నేడు విజయవాడలో జనసేన జెండా చూసి వైసీపీ నాయకులు భయపడ్డారని ఆయన వ్యాఖ్యానించారు. వీళ్ళు చేసే దౌర్జన్యాలను జనసేన పార్టీ బలంగా ఎదుర్కొంటుందని.. ఎప్పటికప్పుడు వీళ్ళ దుష్ట పాలనను ప్రజా క్షేత్రంలో నిలదీస్తామని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
ఏం జరిగిందంటే :
జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని విజయవాడలోని రాయల్ హోటల్ సెంటర్ వద్ద వున్న జనసేన పార్టీ జెండా దిమ్మెకి శ్రేణులు రంగులేసి అలంకరించారు. అయితే అది తమ పార్టీదంటూ వైసీపీ నేతలు కార్యక్రమానికి అడ్డుతగిలారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు జనసేన కార్యకర్తలను పక్కకు నెట్టివేయడం వివాదాస్పదమైంది. సమాచారం అందుకున్న జనసేన నేత పోతిన మహేశ్ పోలీసులతో వాదనకు దిగారు. ఈ క్రమంలో ఆయనను అదుపులోకి తీసుకుని భవానీపురం పీఎస్‌కు తరలించారు.