Janasena :  సమస్యలు వినే తీరిక జగన్‌కి లేదు.. అందుకే ‘‘జనవాణి’’, జనానికి మేమున్నాం: నాదెండ్ల

జనసేన బలం ఏంటో చూపించాల్సింది వీర మహిళలేనన్నారు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. శనివారం మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కృష్ణా, గుంటూరు జిల్లాల మహిళా క్రియాశీలక సభ్యుల రాజకీయ శిక్షణా తరగతుల కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీర మహిళలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ... ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలని ఆయన దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల తర్వాత మూడు నెలలకే ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల సమస్యల మీద పవన్ కళ్యాణ్ పోరాటం చేశారని నాదెండ్ల గుర్తుచేశారు. ఆయన పిలుపు మేరకు వాడ వాడలా శ్రీమతి డొక్కా సీతమ్మ స్ఫూర్తితో భవన నిర్మాణ కార్మికుల కడుపు నింపామని మనోహర్ తెలిపారు.

రాష్ట్రంలో ఇసుక , లిక్కర్ మాఫియా రాజ్యం:

జగన్ రెడ్డి ప్రభుత్వం ఎంతో మందికి అన్యాయం చేస్తోందని.. రాష్ట్రంలో ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా రాజ్యమేలుతున్నాయని ఆయన ఆరోపించారు. నేటి పాలకుల గురించి సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని నాదెండ్ల సూచించారు. పార్టీ నుంచి వచ్చే సమాచారాన్ని క్షేత్ర స్థాయికి తీసుకువెళ్లడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని ఆయన కోరారు. ప్రభుత్వ లోపాలు ఎత్తిచూపితే దాడులు చేస్తున్నారని.. అక్రమ కేసులు పెడుతున్నారంటూ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. అలాంటి పరిస్థితుల్లో మీకు అండగా ఉండేందుకు పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున బలమైన న్యాయ విభాగాన్ని ఏర్పాటు చేశారని ఆయన గుర్తుచేశారు. ఎవరో పోస్టులు పెడితే జనసైనికులపై కేసులు పెట్టారని.. పోలీసులతో కొట్టించి పైశాచికానందాన్ని పొందుతున్నారని మనోహర్ దుయ్యబట్టారు.

జనవాణిలో పవన్ స్వయంగా అర్జీలు స్వీకరిస్తారు:

ప్రజల సమస్యలు వినే తీరిక ముఖ్యమంత్రికి లేదని.. వారి ఎమ్మెల్యేలు కూడా అదే పంధాలో పయనిస్తున్నారని ఆయన ఫైరయ్యారు. ఈ పరిస్థితుల్లో సామాన్యుడి సమస్యలు తెలుసుకుని వారికి భరోసా నింపేందుకు పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమం చేపట్టారని నాదెండ్ల తెలిపారు. ఈ నెల 3,10 తేదీల్లో విజయవాడ మాకినేని బసవపున్నయ్య భవన్ లో ప్రత్యక్షంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని సాయంత్రానికి సంబంధిత అధికారులకు పవన్ కళ్యాణ్ స్వయంగా కవరింగ్ లెటర్ తో సమాచారం ఇస్తారని మనోహర్ వెల్లడించారు. మరుసటి రోజు అధికారుల దృష్టికి సమస్యలను తీసుకువెళ్లి పరిష్కారం చూపుతారని ఆయన చెప్పారు.

రాష్ట్రంలో 3 వేల మంది కౌలు రైతుల ఆత్మహత్య:

జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పవన్ కళ్యాణ్ వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చి రూ. 5 కోట్ల సొంత నిధులు ఇచ్చి ఆదుకున్నారని కొనియాడారు. ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా అలా సొంత డబ్బు సాయం చేసిన దాఖలాలు ఉన్నాయా అని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. జనసేన చేస్తున్న సాయాన్ని ముఖ్యమంత్రి సిగ్గులేకుండా అవహేళన చేస్తున్నారని.. రైతుల ఆత్మహత్యల్ని అవమానించే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చెక్కులు తీసుకున్న వారు రైతులే కాదంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీ దగ్గర లెక్కలు లేవంటే మేం ఇస్తాం:

ఇప్పటి వరకు నాలుగు జిల్లాల్లో కౌలు రైతు కుటుంబాలకు రూ. లక్ష చొప్పున ఆర్ధిక సాయం చేశామని.. ప్రభుత్వం దగ్గర లెక్కలు లేకుంటే మా పార్టీని అడిగితే ఇస్తాంటూ నాదెండ్ల చురకలు వేశారు. మీకు దమ్ముంటే స్వయంగా మా సభలకు రమ్మని చెప్పామని ఆయన గుర్తుచేశారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలో 13 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని.. అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి సొంత అమ్మమ్మ గారి గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి జనసేన పార్టీ రూ. లక్ష ఆర్ధిక సాయం చేసిందని నాదెండ్ల మనోహర్ తెలిపారు.

జనసేన అధికారంలోకి రావాలి:

తాము అడుగుతుంది మీరు పాదయాత్రలో ప్రకటించిన విధంగా రూ. 7 లక్షల సాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికీ ఇచ్చిన హామీ మేరకు రూ. 7 లక్షల పరిహారం చెల్లించాలని మనోహర్ కోరారు. తూర్పు గోదావరి జిల్లాలో 57 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం రాష్ట్రంలో దుస్థితిని తెలియచేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. క్రియాశీలక సభ్యురాళ్లుగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని... జనసేన పార్టీ అధికారంలోకి రావాలని నాదెండ్ల మనోహర్ ఆకాంక్షించారు.