Janasena party : కాపలాదారే దోపిడీకి పాల్పడితే ఎలా.. 800 కోట్లు ఏమయ్యాయి : ‘జీపీఎఫ్’ డబ్బు మాయంపై నాదెండ్ల
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లోని దాదాపు రూ.800 కోట్ల నగదు మాయమైన ఘటన ఏపీలో కలకలం రేపుతోంది. దీనిపై ఉద్యోగులు మండిపడుతున్నారు. తమ అనుమతి లేకుండా ఇలా జరగడమేంటని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దీనిపై జనసేన పార్టీ స్పందించింది. వైసీపీ ప్రభుత్వ పెద్దలకు సూట్ కేసు కంపెనీలు పెట్టి, దొంగ లెక్కలు రాసిన అనుభవంతో కాగ్ కళ్ళకు గంతలు కట్టేలా నివేదికలు ఇస్తున్నారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన లబ్ధిదారుల లెక్కల్లోనూ మాసిపూసి మారేడుకాయ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఉద్యోగులకు చెప్పకుండా విత్ డ్రా ఎలా:
ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జీపీఎఫ్ సొమ్ములను వారికి తెలియకుండా ప్రభుత్వమే మాయం చేయడం విస్మయం కలిగిస్తోందని మనోహర్ దుయ్యబట్టారు. ఇప్పటి వరకూ వెలుగులోకి వచ్చిన లెక్కల ప్రకారం రూ.800 కోట్లు సొమ్మును ప్రభుత్వం మళ్లించిందని ఆయన ఆరోపించారు. ఉద్యోగుల ఖాతాల్లో ఉన్న ఈ డబ్బులు వారికి తెలియకుండా తీసేసుకోవడం అంటే మోసం చేయడమేనని నాదెండ్ల ఎద్దేవా చేశారు.
కాపలాదారే దోపిడీకి పాల్పడితే ఎలా:
వైసీపీ ప్రభుత్వ ఆర్థిక పాలన ఆశ్చర్యం కలిగిస్తోందని.. జీపీఎఫ్ ఖాతాలోని డబ్బులను డ్రా చేసుకొనే అధికారం కేవలం ఉద్యోగికి మాత్రమే ఉంటుందని మనోహర్ గుర్తుచేశారు. ప్రభుత్వం ఆ నిధికి కేవలం కస్టోడియన్ మాత్రమేనని.. కాపలాదారే దోపిడీకి పాల్పడితే ఎలా అని ఆయన ప్రశ్నించారు. వైద్య ఖర్చులకో, బిడ్డ పెళ్ళికో, చదువులకో పీఎఫ్ డబ్బుల కోసం దరఖాస్తు చేస్తే నెలల తరబడి అనుమతి ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం పెండింగ్ లో వుంచుతుందోని నాదెండ్ల మనోహర్ ఎద్దేవా చేశారు.
రూ.800 కోట్లు ఏమయ్యాయి:
కానీ ఉద్యోగుల సొమ్మును వారికి తెలియకుండానే తీసేసుకొంటోంది అంటే ఈ పాలకుల ఆర్థిక క్రమశిక్షణ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు కరవు భత్యం పీఎఫ్ ఖాతాలో వేసినట్లే వేసి వెనక్కి తీసుకోవడం ద్వారా మోసం చేశారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. అలాగే రిటైర్ అయిన ఉద్యోగులకు కూడా రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం నిలుపుదల చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. రూ.800 కోట్లను ఎటు మళ్లించారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments