Nagababu: 'రుషి కొండ'ను గుండు కొట్టినట్టు కొట్టేశారు... ప్రశ్నించకుండా వుంటామా: నాగబాబు
Send us your feedback to audioarticles@vaarta.com
వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, సినీనటుడు నాగబాబు. ఉత్తరాంధ్ర పర్యటనలో వున్న ఆయన విజయనగరంలో మీడియాతో మాట్లాడారు. ప్రకృతి వనరులు, ప్రభుత్వ ఆర్థిక వనరులను అడ్డగోలుగా వైసీపీ ప్రభుత్వం దోచేసుకుంటుందని నాగబాబు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వాన్ని పదే పదే విమర్శిస్తున్నారు అని మీడియా ప్రతినిధి అడగ్గా దానికి నాగబాబు స్పందిస్తూ.. రుషి కొండను గుండు కొట్టినట్టు కొట్టేసిన విషయం మీడియా ద్వారానే తెలిసిందని స్పష్టం చేశారు. మరి అలాంటప్పుడు అడగకుండా ఎలా ఉంటామని నాగబాబు ప్రశ్నించారు.
వైసీపీ అవినీతిపై మీడియా కోడై కూస్తోంది:
వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అరాచకాలపై మీడియా కోడై కూస్తోందని, మీడియాలో వస్తోన్న కథనాలకు సంబంధించి నిజానిజాలు నిర్ధారణ చేసుకున్నాక ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలను పేరు పెట్టి విమర్శించడం తమ అభిమతం కాదని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే మాత్రం తప్పనిసరిగా ప్రశ్నిస్తామన్నారు.
పొత్తుల విషయంలో పవన్‌దే తుది నిర్ణయం:
ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని నాగబాబు తేల్చిచెప్పారు. పార్టీ పొత్తుల విషయంలో పవన్ కల్యాణ్‌దే తుది నిర్ణయమని, జనసైనికులుగా తామంతా ఆయన నిర్ణయమే శిరోధార్యంగా శిరసావహిస్తామని స్పష్టం చేశారు. జనసేనలో ప్రతీ కార్యకర్తా నాయకుడిగా పనిచేస్తారని, కార్యకర్తలను నాయకులుగా తయారు చేయడమే జనసేన పార్టీ ప్రధాన విధానమన్నారు. ఆ కోవలోనే జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, కమిటీల్లో కార్యకర్తలకు ప్రాధ్యానత ఇస్తున్నామని నాగబాబు వెల్లడించారు.
అవకాశం దొరికినప్పుడల్లా విజయనగరం వస్తా:
ప్రజా సమస్యల పరిష్కారం ధ్యేయంగా జనసైనికులు పని చేస్తున్నారని ప్రశంసించారు. విజయనగరం జిల్లాలో చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపుకోట, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం, కురపాం నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలతో సమావేశమై పార్టీ బలోపేతం దిశగా నిర్దేశం చేసినట్లు ఆయన వెల్లడించారు. అవకాశం దొరికినప్పుడల్లా జిల్లాలో పర్యటిస్తానని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం కార్యకర్తలతో మాట్లాడుతానని నాగబాబు పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout