Pawan Kalyan : రాష్ట్రవ్యాప్తంగా పవన్ బస్సు యాత్ర.. తిరుపతి నుంచే ఆరంభం, ఆరు నెలలు ప్రజల్లోనే
Send us your feedback to audioarticles@vaarta.com
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు తప్పవని ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. శుక్రవారం మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో క్రియాశీలక సభ్యుల బీమా పత్రాలు, కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అత్యధిక సభ్యత్వాలు చేసిన వాలంటీర్లకు స్వయంగా మెమెంటోలు ఇచ్చి సత్కరించారు. అనంతరం నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు, ప్రజా వ్యతిరేక విధానాలను ఎదిరించేందుకు విజయదశమి నుంచి పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్త యాత్రకు శ్రీకారం చుడుతున్నారని చెప్పారు. అక్టోబర్ 5వ తేదీన తిరుపతి నుంచి రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఈ యాత్ర మొదలవుతుందని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు.. సిద్ధంగా వుండండి:
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రతి క్రియాశీలక సభ్యుడు సిద్ధంగా ఉండాలని.. ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రజలంతా జగన్ రెడ్డికి ఇంకోసారి ఓటు వేయకూడదని ఎప్పుడో నిర్ణయించుకున్నారని మనోహర్ దుయ్యబట్టారు. జూలై మాసానికల్లా గ్రామ కమిటీలు, పట్టణ, వార్డు స్థాయి కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని నాదెండ్ల కోరారు. రాబోయే రోజుల్లో పార్టీ తరఫున మరిన్ని కార్యక్రమాలు చేపట్టబోతున్నామని... కష్టకాలంలో, ఎవరూ నమ్మని సమయంలో మీరంతా పార్టీకి అండగా నిలబడ్డారని ఆయన కొనియాడారు.
సమస్య పరిష్కారమే జనసేన లక్ష్యం:
పార్టీ నిర్మాణ సమయంలోనూ పవన్ కళ్యాణ్ మాటకు గౌరవం ఇచ్చి, ఆయన ఇచ్చిన ప్రతి పిలుపుకీ స్పందించారని నాదెండ్ల మనోహర్ క్రీయాశీలక సభ్యులను ప్రశంసించారు. జనసేన పార్టీవి స్వార్ధంతో కూడిన రాజకీయాలు కావని.. జనసేన పార్టీ అవకాశవాద రాజకీయాలు చేయదని ఆయన స్పష్టం చేశారు. జనసేన పార్టీకి నిజాయితీగా ఒక సమస్య పరిష్కారం కోసం పని చేయాలన్న ఆలోచన మినహా మరే ఆలోచన ఉండదని మనోహర్ తేల్చి చెప్పారు.
జనసేన పార్టీ గొప్పతనం జనసైనికులే:
కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం మొదలుపెట్టామని.. దీనికి జనసైనికులు అద్భుతంగా స్పందించారని గుర్తుచేసుకున్నారు. ఓ వైపు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూనే పవన్ కళ్యాణ్ ఆదేశాలను ముందుకు తీసుకువెళ్లారని నాదెండ్ల ప్రశంసించారు. జనసేన పార్టీ గొప్పతనం జనసైనికులేనని... వారు కోరేది ఒక బలమైన మార్పు అన్నారు. రాజకీయ వ్యవస్థ దుర్మార్గంగా కొంత మంది పెద్ద వ్యక్తుల కోసమే పని చేస్తుందని.. అలాంటి వ్యవస్థల్ని మార్చాలన్న లక్ష్యంతో ప్రతి జనసైనికుడు పని చేస్తున్నారని మనోహర్ కొనియాడారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout