Pawan kalyan: సికింద్రాబాద్ అల్లర్లు, బాసర విద్యార్ధుల సమస్యలపై పవన్ కళ్యాన్ స్పందన
- IndiaGlitz, [Friday,June 17 2022]
భారత సైన్యంలో నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఆందోళన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్నిపథ్ పథకం ద్వారా ఆర్మీ రిక్రూట్మెంట్ విధానంపై చేపట్టిన ఈ నిరసనల నేపథ్యంలో జరిగిన సంఘటనలు ఆవేదన కలిగించాయని పవన్ తెలిపారు. పోలీసు కాల్పుల్లో మృతి చెందిన యువకుడి కుటుంబానికి జనసేనాని తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.
విద్యార్ధుల సమస్యలను పరిష్కరించండి:
ఇకపోతే.. చదువుల తల్లి సరస్వతి దేవి కొలువైన బాసర ట్రిపుల్ ఐటీ వివాదంపైనా జనసేనాని స్పందించారు. విద్యార్ధులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలంగాణ ప్రభుత్వం పరిష్కరించాలని ఆయన కోరారు. ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సానుకూల చర్యలు చేపట్టాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు ఆందోళన విరమించే దిశగా ప్రభుత్వం స్పందించాలన్నారు. ట్రిపుల్ ఐటీలను ఏ లక్ష్యం కోసం స్థాపించారో అది నెరవేరే విధంగా ప్రభుత్వ యంత్రాంగం కృషి చేయాలని పవన్ కోరారు.
బాసరలో ఇది వివాదం:
కాగా.. తమ సమస్యలు పరిష్కరించాలంటూ గత కొద్దిరోజులుగా బాసర అర్జీయూకేటి-ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో క్యాంపస్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కళాశాల మెస్‌లలో భోజనం సరిగా ఉండటం లేదని, విద్యుత్, నీటి సమస్యలు వున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు కనీసం ల్యాప్ టాప్ లు కూడా ఇవ్వకుండా చదువు పట్ల అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్ధులను పరామర్శించేందుకు వెళ్తున్న తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.