JaganannaMosam : 'జగనన్న ఇళ్లు - పేదలందరికీ కన్నీళ్లు'... వైసీపీ పాలనపై జనసేన మరో పోరాటం
Send us your feedback to audioarticles@vaarta.com
వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న జగనన్న కాలనీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. జగనన్న కాలనీల పేరిట పేదవాడికి జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు ఈ నెల 12, 13, 14 తేదీలలో ‘‘జగనన్న ఇళ్లు... పేదలందరికీ కన్నీళ్లు ’’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తీసిన ఫోటోలు, వీడియోలను #JaganannaMosam హ్యాష్ ట్యాగ్ ద్వారా సోషల్ మీడియాలో పోస్టు చేసి ప్రభుత్వ తీరును ఎండగట్టాలని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.
ఐదు నెలలు గడుస్తున్నా నెరవేరని హామీ :
పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఏదో ఒక చోట ఈ కార్యక్రమంలో పాల్గొని జగనన్న కాలనీలను పరిశీలిస్తారని ఆయన తెలిపారు. పేదలందరికీ ఇళ్లు పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 28 లక్షల 30వేల మందికి ఇళ్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి హామీ ఇచ్చారని నాదెండ్ల గుర్తుచేశారు. దీనిలో భాగంగా తొలి విడతలో 18,63,552 గృహాలు 2022 జూన్ నాటికి నిర్మించి పేదలకు అందిస్తామని చెప్పారని ఆయన తెలిపారు. కానీ చెప్పిన గడువు ముగిసి ఐదు నెలలు కావొస్తోందని రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక్క ఇల్లు కూడా పేదలకు ఇచ్చిన దాఖలాలు లేవని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.
జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయల లేమి:
జగనన్న కాలనీల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 68,677 ఎకరాలను ప్రభుత్వం కొనుగోలు చేసిందని ఆయన చెప్పారు. రూ.10 నుంచి రూ.20 లక్షలు విలువ చేసే ఎకరా భూమిని రూ. 70 లక్షలు నుంచి కోటి రూపాయలు పెట్టి కొనుగోలు చేశారని నాదెండ్ల తెలిపారు. సుమారు రూ.23,500 కోట్లు వెచ్చించి ఈ భూములు కొన్నారని.. ఇందులో వందల కోట్లు చేతులు మారాయని ఆయన ఆరోపించారు. అలాగే మౌలిక సదుపాయాలు కోసం మరో రూ.34 వేల కోట్లు ప్రభుత్వం కేటాయించిందని నాదెండ్ల చెప్పారు. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసినా జగనన్న కాలనీల్లో తాగునీరు, రోడ్లు వంటి కనీసం మౌలిక సదుపాయాలు లేవని ఆయన దుయ్యబట్టారు.
డబ్బంతా కేంద్రానిదే.. ఇసుక మాత్రమే రాష్ట్రానిది:
గృహ నిర్మాణ పథకానికి నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నవేనని... ఈ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఇసుకను మాత్రమే ఉచితంగా అందిస్తోందన్నారు. అది కూడా ఇసుక రవాణాకు అయ్యే ఖర్చు లబ్ధిదారుడే భరించాలని కండీషన్ పెట్టిందని.. ఇస్తున్న ఇసుక కూడా ఎక్కడ నుంచి తెచ్చుకోవాలో స్పష్టత ఇవ్వడం లేదని నాదెండ్ల మండిపడ్డారు. 2022 జూన్ నాటికి 18,63,552 గృహాలు నిర్మిస్తామని చెప్పిన నాయకులు... ఇప్పటి వరకు కేవలం లక్షా 52 వేల ఇళ్లను మాత్రమే నిర్మించారని ఆయన దుయ్యబట్టారు. ఇంత దయనీయ పరిస్థితి ఎందుకొచ్చింది? పేదలను ఎందుకింత దగా చేశారు? ప్రజలకు సమాధానం చెప్పాలని మనోహర్ డిమాండ్ చేశారు.
#JaganannaMosam హ్యాష్‌ట్యాగ్‌తో ఫోటోలు, వీడియోలు ట్రెండ్ చేయండి :
జగనన్న ఇళ్లు పేరిట గత మూడున్నరేళ్లుగా జరుగుతున్న దోపిడీని ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా జనసేనపై ఉందన్నారు. 2020లో పులివెందుల, కాకినాడ, విజయనగరంలో జగనన్న కాలనీలకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేసి... పైలాన్ వేశారని జూన్ 2022 కల్లా తొలి విడత ఇళ్లను పూర్తి చేస్తామని చెప్పారని నాదెండ్ల గుర్తుచేశారు. కానీ గడువు దాటినా దీని గురించి ముఖ్యమంత్రి మాట్లాడటం లేదని... ఈ నెల 12, 13 తేదీల్లో స్థానికంగా ఉన్న జగనన్న కాలనీలను సందర్శించి ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించాలని ఆయన శ్రేణులకు పిలుపునిచ్చారు. 14వ తేదీన పథకం లబ్ధిదారుల జాబితా, వారికి ఏ మేరకు నిధులు విడుదల చేశారు, మౌలిక సదుపాయాల కల్పన ఖర్చులు లాంటి అంశాలపై సోషల్ ఆడిట్ చేస్తామన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com