Nadendla Manohar: ఇగోలోద్దు.. పవన్‌ను సీఎంగా చూడాలంటే కష్టపడండి : శ్రేణులకు నాదెండ్ల దిశానిర్దేశం
- IndiaGlitz, [Sunday,June 05 2022]
పార్టీ నిర్మాణమంటే సామాన్యమైన విషయం కాదని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఒక వ్యక్తితో అది సాధ్యం కాదని.. సమష్టిగా కష్టపడితేనే పార్టీని అద్భుతంగా నిర్మించుకోగలమని, దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. తెలిసో, తెలియకో, కోపంలోనో, ఆవేశంతోనో, ఇగోలతోనో పని చేయొద్దని జనసైనికులకు నాదెండ్ల మనోహర్ సూచించారు. పవన్ కళ్యాణ్ ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని.. క్రమశిక్షణ గల గొప్ప నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
చిన్న నష్టం జరిగినా పూడ్చుకోలేం:
అందర్నీ కలుపుకొని వెళ్లాలని నాదెండ్ల దిశానిర్దేశం చేశారు. పార్టీకి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలంటే ఎవరో ఏదో చెప్పరని, మీరే నిర్ణయాలు తీసుకోవాలని ఆయన కోరారు. నాయకులతో చర్చించి... అంతా కలిసి ముందుకు వెళ్లాలని నాదెండ్ల మనోహర్ సూచించారు. పార్టీకి మీ చర్య వల్ల చిన్న డామేజ్ జరిగినా దాన్ని మళ్లీ పూడ్చుకోవడానికి చాలా సమయం పడుతుందని ఆయన హెచ్చరించారు. ‘ఆశ వదులుకుంటే ధైర్యంగా ముందుకువెళ్లలేం’ అనే ఈ మాటను గుర్తుంచుకోవాలని నాదెండ్ల మనోహర్ అన్నారు.
హడావుడి తగ్గించుకోండి:
జెండా పట్టుకొని తిరిగే ధైర్యమున్న జనసైనికుల్ని, వీర మహిళలను వదులుకోవద్దని, వారికి తగిన గౌరవం ఇవ్వాలని ఆయన నేతలకు సూచించారు.. చిన్న విషయాలకు గొడవలు పడకుండా, సమస్య పరిష్కారం మీద దృష్టి పెట్టాలని హితవు పలికారు. సోషల్ మీడియాలో హడావుడి చేయడం కాకుండా, క్షేత్రస్థాయిలో తిరగాలని నాదెండ్ల మనోహర్ సూచించారు. ఎవరో వచ్చి మేం నాయకులు, జనసైనికులం అంటే నమ్మాల్సిన పనిలేదన్నారు.
సభ్యత్వ నమోదులో వాలంటీర్ల కృషి ప్రశంసనీయం:
ఒక్కో మెట్టు ఎక్కుతూ క్రమంగా ముందుకు వెళ్తున్నామని.. ఎన్నో అనుమానాలు, అవమానాలు తట్టుకొని నిలబడిన ఓ గొప్ప ప్రస్థానం మనదని నాదెండ్ల గుర్తుచేశారు. తెలుగు రాష్ట్రాల్లో 3.50 లక్షల మంది క్రీయాశీలక సభ్యుల సభ్యత్వాలు పూర్తి అవ్వడం సంతోషంగా వుందన్నారు. సభ్యత్వ నమోదులో 7,967 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా పనిచేశారని.. వారందరినీ గౌరవించుకోవాలని నాదెండ్ల అన్నారు. ఈ నెల 10, 11 తేదీల్లో జనసేన పార్టీ క్రీయాశీలక సంబరాలు చేసుకుంటున్నామని.. మండలాలు, గ్రామాలకు పార్టీని తీసుకువెళ్లడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని శ్రేణులకు మనోహర్ పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ మనోగతం పేరుతో ఓ బుక్ ఇస్తున్నామని... పార్టీ ఐడియాలజీ, పవన్ కళ్యాణ్ ఆశయాలు తెలిసేలా పుస్తకం తయారైందని ఆయన తెలిపారు. మనం కనిపించకపోయినా, మన పనులు కనిపించాలి అనే బలమైన ధ్యేయంతో పనిచేస్తే త్వరలోనే పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడొచ్చు అని నాదెండ్ల మనోహర్ ఆకాంక్షించారు.
జగన్ సొంత జిల్లాలో 132 మంది రైతుల ఆత్మహత్య.. జనసేన ఆదుకుంటుంది:
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో గత మూడేళ్లలో 132 మంది కౌలు రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని తెలిపారు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. సీఎం సొంత నియోజకవర్గం పులివెందులలోనూ 13 మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారికి కూడా జనసేన పార్టీ తరఫున అండగా నిలబడతామని.. సమావేశం ఏర్పాటు చేసి, కౌలు రైతుల కుటుంబాలను ఆదుకుంటామని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
పెట్టిన పెట్టుబడి రాక.. ధర గిట్టక.. అప్పుల వారికి సమాధానం చెప్పుకోలేక రైతులు తనువు చాలిస్తున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు. సొంత నియోజకవర్గంలోని రైతుల బాధే పట్టని ఈ ముఖ్యమంత్రి తీరు- తల్లికి అన్నం పెట్టలేడు కాని.. పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తున్నాడు అన్న చందాన ఉందని నాదెండ్ల సెటైర్లు వేశారు. జనసేన కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టన తరువాతే కొంతమంది కౌలు రైతుల కుటుంబాలకు రూ. 7 లక్షల నష్ట పరిహారం అందిందని మనోహర్ గుర్తుచేశారు. ఇది కచ్చితంగా జనసేన పార్టీ విజయమేనని ఆయన అన్నారు.