Janasena Party : మీ పిచ్చి ప్రేలాపనలు పట్టించుకోం.. దమ్ముంటే జనంలో తిరగండి: వైసీపీకి నాదెండ్ల చురకలు
Send us your feedback to audioarticles@vaarta.com
వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ . వైసీపీ పిచ్చి ప్రేలాపనలు పట్టించుకునే తీరిక జనసేన పార్టీకి లేదని ఆయన స్పష్టం చేశారు. సోమవారం ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జనసేన కార్యాలయాన్ని మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ... కుటుంబాన్ని, సినిమాలను వదిలి 365 రోజులు ప్రజా క్షేమం కోసం పాటుపడుతున్న ఏకైక నాయకుడు పవన్ కల్యాణ్ అని ప్రశంసించారు.
త్వరలో పల్నాడులో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర:
రాష్ట్ర ప్రజానీకానికి సొంత డబ్బు వెచ్చించి సేవ చేస్తున్న నాయకుడని కొనియాడారు. రాబోయే రోజుల్లో పల్నాడు ప్రాంతంలోనే జనసేన కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టనున్నట్టు మనోహర్ చెప్పారు. ముఖ్యమంత్రికి, ఆ పార్టీ నాయకులకు ప్రజా సంక్షేమం పట్ల ఏ మాత్రం నిజాయతీ, చిత్తశుద్ది ఉన్నా ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు అండగా నిలవాలని నాదెండ్ల డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ మాదిరి వారి కుటుంబాల్లో పిల్లల చదువులకు అండగా నిలబడాలని ఆయన కోరారు.
జనవాణికి అద్భుతమైన స్పందన:
పవన్ కళ్యాణ్ లాంటి నిజాయతీపరుడైన నాయకుడు మరొకరు లేరని నాదెండ్ల చెప్పారు. మా నిజాయతీయే మాకు ధైర్యమని... వైసీపీ నాయకుల చౌకబారు విమర్శలు పట్టించుకోమని నాదెండ్ల మనోహర్ చురకలు వేశారు. గతంలో మంత్రి పదవులు కాపాడుకోవడానికి విమర్శలు చేశారని... వారు చేసే విమర్శల్లో వీసమెత్తు నిజాయతీ లేదని ఆయన దుయ్యబట్టారు. వైసీపీ నాయకుల కల్లబొల్లి కబుర్లు ఎవరూ పట్టించుకునే స్థితిలో లేరని.. రాబోయే ఆరు నెలల కాలం జనసేన పార్టీ నిత్యం ప్రజల్లో ఉండి, ప్రజల పక్షాన పోరాటం చేసేలాగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇప్పటికే జనవాణి పేరిట అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించామని ఆయన గుర్తుచేశారు.
దమ్ముంటే పవన్‌లా జిల్లాల్లో తిరగండి:
నిన్నటి కార్యక్రమంలో 539 అర్జీలు పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చాయని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని... ఆయన మీద విమర్శలు చేసే ముఖ్యమంత్రికి, వైసీపీ నాయకులకు చిత్తశుద్ది ఉంటే పవన్ కళ్యాణ్‌లా జిల్లాల్లో తిరగాలని సవాల్ విసిరారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు హామీ ఇచ్చిన విధంగా రూ. 7 లక్షల పరిహారం అందించాలని నాదెండ్ల డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ మాదిరి ఆ రైతుల బిడ్డల చదువులకు అండగా నిలబడాలని మనోహర్ కోరారు. స్థానికంగా పార్టీని బలోపేతం దిశగా జనసైనికులు అద్భుతంగా పని చేస్తున్నారని ప్రశంసించారు. పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు వినే విధంగా పని చేస్తున్నారని నాదెండ్ల కొనియాడారు. పల్నాడు ప్రాంతంలో పార్టీ రోజు రోజుకీ బలపడుతోందని... రాబోయే రోజుల్లో ఇదే ప్రాంతంలో రైతు భరోసా యాత్ర చేపడతామని మనోహర్ వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com