Nadendla Manohar: హెలికాఫ్టర్‌లో వెళ్లడమే .. జనం గోడు పట్టదు: జగన్ పాలనపై నాదెండ్ల విమర్శలు
- IndiaGlitz, [Monday,June 05 2023]
పదవీ కాలం పూర్తయ్యే సరికి ఎన్ని కోట్లు మిగిలాయి? ఎన్ని వేల కోట్లు వెనకేసుకున్నాం అని ఆలోచించే వారి కనుసన్నల్లో ఆంధ్రప్రదేశ్ నడుస్తోందన్నారు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. ఆదివారం తెనాలి నియోజకవర్గం, కొల్లిపర మండలం, చక్రాయపాలెం గ్రామంలో నిర్వహించిన జనసేన శ్రేణుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో రైతాంగానికి నష్టం జరిగితే కనీసం వారిని ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభ దశలో ఉందన్న ఆయన రైతులు వలసలు వెళ్లిపోయే పరిస్థితి కనిపిస్తోందని నాదెండ్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల రైతులను కలుసుకునేందుకు పవన్ కళ్యాణ్‌తో కలిసి తూర్పుగోదావరి జిల్లా వెళ్ళినప్పుడు అక్కడున్న రైతులు చెప్పిన సమస్యలు వింటే కళ్లు చెమర్చాయని ఆయన గుర్తుచేసుకున్నారు.
పాత బిల్డింగ్‌లకు రంగులేసి .. నిధులు జేబుల్లోకి :
ఈ ప్రభుత్వ విధానాలు రైతుకు ఏ మాత్రం మేలు చేసేవిగా లేవని.. కేంద్రం ఇస్తున్న రూ. 7,500కి తోడు, రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ. 6,500 ఇచ్చి చేతులు దులుపుకుంటోందని నాదెండ్ల దుయ్యబట్టారు. బటన్ నొక్కితే జీవితాలు బాగుపడిపోవని.. క్షేత్రస్థాయిలో రైతుల బాధలను కనీసం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం గోనె సంచులు కూడా సరఫరా చేయలేని అసమర్ధ ప్రభుత్వమని.. రైతు భరోసా కేంద్రాల ద్వారా రూ. 6,300 కోట్ల అవినీతి జరిగిందని, ఉన్న భవనాలకే రంగులు వేసి నిధులను జేబులో వేసుకున్నారని మనోహర్ ఆరోపించారు. రైతు భరోసా కేంద్రాల్లో సిబ్బంది ఉండటం లేదని.. ఉన్న వారితో రైతులకు ఏమాత్రం ప్రయోజనం చేకూరడం లేదని మండిపడ్డారు. ఈ హెలికాప్టర్ ముఖ్యమంత్రి.. ఎక్కడికి వచ్చినా ఆ ప్రాంతంలో కనీసం ప్రజలతో, రైతులతో మాట్లాడిన దాఖలాలు లేవన్నారు. రైతులకు కనీస గౌరవం ఇవ్వని వ్యవస్థ రాష్ట్రంలో నెలకొందని, అభివృద్ధిపై కనీస ప్రణాళికా లేదని మనోహర్ చురకలంటించారు.
బటన్లు నొక్కుతూ అభివృద్ధి పక్కనబెట్టారు :
రాజధాని నిర్మాణం నిమిత్తం రాజకీయాలకు అతీతంగా అమరావతి రైతులు 30 వేల ఎకరాల భూమి ఇచ్చారని.. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత అమరావతికి తీరని ద్రోహం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి గురించి పోరాడుతున్న రైతులతో కనీసం చర్చించని, వారితో కనీసం మాట్లాడని నైజం ముఖ్యమంత్రిదన్నారు. ముఖ్యమంత్రి నివాసానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రైతులతో మాట్లాడలేని ఈ ముఖ్యమంత్రికి రైతుల మీద ఎంత గౌరవం ఉందో అర్థమవుతుందన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా అప్పట్లో భూములను ఇచ్చిన రైతులు భవిష్యత్తు మీద ఎన్నో కలలు కన్నారని.. భూములకు ధరలు పెరుగుతాయని , తమ బతుకులు బంగారం అవుతాయని భావించారని నాదెండ్ల పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్ష కట్టినట్లు రైతులను పూర్తి స్థాయిలో నాశనం చేసిందని.. సంక్షేమం పేరుతో ఈ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని మనోహర్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర అప్పులు రూ.6 లక్షల కోట్లకు చేరాయని.. అభివృద్ధి ఎక్కడుంది..? కనీసం రోడ్లు కూడా వేయకుండా బటన్లు నొక్కుతున్నామంటూ ప్రజలను భ్రమ పెడుతున్నారని నాదెండ్ల చురకలంటించారు.
వైసీపీ నేతలు ధనవంతులయ్యారు :
జగనన్న ఇళ్ల కాలనీల పేరుతో సెంటు స్థలం పేదలకు ఇస్తున్నామని చెప్పి, వేలకోట్లను వైసీపీ నాయకులు జేబులో వేసుకున్నారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. రైతుల వద్ద నామమాత్రపు ధరకు భూములను కొని, వాటిని భారీ మొత్తానికి ప్రభుత్వానికి అమ్మారని, ఫలితంగా వైసీపీ నాయకులు ధనవంతులయ్యారని ఆయన పేర్కొన్నారు. పేదలు కనీసం సెంటు స్థలంలో ఇల్లు కట్టుకోలేక, ప్రభుత్వం ఇచ్చిన డ్వాక్రా రుణాలకు వడ్డీలు కట్టుకోలేక సతమతమవుతున్నారని నాదెండ్ల ఆరోపించారు