Janasena party : ఆయన కుమారుల బాధ్యత పార్టీదే .. కార్యకర్త కుటుంబానికి నాదెండ్ల భరోసా
- IndiaGlitz, [Friday,June 10 2022]
దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా, పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు జనసేన ప్రమాద బీమా చేయించిందన్నారు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. తెనాలిలోని లింగారావు బజార్ ప్రాంతానికి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు పులిగెండ్ల సుబ్రహ్మణ్యం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఆయన కుటుంబాన్ని మనోహర్ పరామర్శించారు. ఈ సందర్భంగా రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కుని సుబ్రహ్మణ్యం భార్య పార్వతికి ఆయన అందజేశారు. స్టీల్ దుకాణంలో పనిచేసే సుబ్రహ్మణ్యం పార్టీ కోసం తన వంతు కష్టపడ్డారని ఆయనను కోల్పోవడం బాధకరమని నాదెండ్ల మనోహర్ అన్నారు. సుబ్రహ్మణ్యం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం అతని కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
మరణించిన కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటాం:
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ కోసం తన వంతుగా పని చేసే సుబ్రహ్మణ్యం లాంటి వ్యక్తులు దూరం కావడం దురదృష్టకరమన్నారు. కార్యకర్తల్లో భరోసా నింపడానికి, వారి కుటుంబాలకు మనోధైర్యం ఇవ్వడానికి జనసేన పార్టీ చేపట్టిన బీమా పథకం ఆపదలో ఆదుకుంటుందని నాదెండ్ల అన్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేసే వారి శ్రేయస్సు గురించి ఆలోచించిన గొప్ప మనసు పవన్ కళ్యాణ్‌దని ఆయన ప్రశంసించారు. ఇంటి పెద్దలు కోల్పోయినా ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ కుటుంబానికి ఎలాంటి సహాయం చేయలేదని నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు.
సుబ్రహ్మణ్యం కుమారుల బాధ్యత జనసేనదే:
పార్వతికి ఫించను కూడా నమోదు చేయలేదని... ప్రభుత్వ అసమర్థత ప్రజలకు శాపంగా మారుతోందని ఆయన దుయ్యబట్టారు. సుబ్రహ్మణ్యం ఇద్దరు కుమారుల్లో పెద్ద కుమారుడు బీటెక్ చదువుతూనే చిన్నపాటి పనులు చేస్తూ ఇంటికి ఆసరాగా నిలుస్తున్నాడని నాదెండ్ల చెప్పారు. ఇదే సమయంలో కాలేజీ ఫీజులు చెల్లించేందుకు ఇబ్బంది పడుతున్నాడని... ఇలాంటి పేదవారికి అండగా నిలబడని ప్రభుత్వం ఎందుకు అని మనోహర్ ప్రశ్నించారు. వారి కుటుంబ బాధ్యతలను జనసేన పార్టీ తీసుకుంటుందని.. కచ్చితంగా సుబ్రహ్మణ్యం ఇద్దరు కుమారులను చక్కగా చదివిస్తామని ఆయన స్పష్టం చేశారు.