వట్టిచెరుకూరు ట్రాక్టర్ ప్రమాదం.. గుంటూరు జీజీహెచ్‌లో క్షతగాత్రులను పరామర్శించిన నాదెండ్ల మనోహర్
- IndiaGlitz, [Tuesday,June 06 2023]
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో ట్రాక్టర్ బోల్తా పడి ఏడుగురు మరణించిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. 20 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటనలో గాయపడిన వారిని గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అనంతరం క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని నాదెండ్ల డాక్టర్లను కోరారు.
శుభకార్యానికి వెళ్తుండగా విషాదం :
కాగా.. కొండేపాడు నుంచి జూపూడికి ఓ శుభకార్యం నిమిత్తం 40 మంది ట్రాక్టర్లో బయల్దేరారు. అయితే ఇది వట్టి చెరుకూరు సమీపంలో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. 20 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారికి ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యంతో పాటు రూ. లక్ష ఆర్ధిక సాయం, స్వల్పగాయాలైన వారికి వైద్య చికిత్స రూ.25 వేల సాయం అందించాలని జగన్ అధికారులను ఆదేశించారు.
ప్రమాదంపై పవన్ దిగ్భ్రాంతి :
అంతకుముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం దురదృష్టకరమని, ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళలు ప్రాణాలు కోల్పవోడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు పవన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన అధికారులను కోరారు.