Nadendla: రాష్ట్ర విభజన... తెలంగాణ ముందుకు, ఏపీ వెనక్కు .. అంతా పవన్ చెప్పినట్లే : నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎంతగా నష్టపోతుందో పవన్ కళ్యాణ్ చెప్పినట్లే జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. ఆదివారం తెనాలి నియోజకవర్గం, కొల్లిపర మండలం, చక్రాయపాలెం గ్రామంలో నిర్వహించిన జనసేన శ్రేణుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాను రాను ఆదాయం పెరగాల్సింది పోయి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోందని నాదెండ్ల ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ ఆదాయం నాలుగు రెట్లు పెరిగితే, ఆంధ్ర ఆదాయం కేవలం 10% మాత్రమే పెరిగిందని తెలిపారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావు.. పెట్టుబడులు లేవు, యువతకు ఉపాధి అవకాశాలు పూర్తిగా పోయాయని మనోహర్ తెలిపారు. పరిశ్రమలు, పెట్టుబడులు లేక అభివృద్ధి కుంటుపడిందని.. వారి ద్వారా కట్టే పన్నుల రాబడి తగ్గిందని నాదెండ్ల తెలిపారు. మాట్లాడితే బూతులు తిడుతూ, పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా విమర్శించే ఉత్సాహం ఉన్న మంత్రులు ఉన్నారు తప్పించి.. రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లే ఆలోచన ఉన్న వారే కనిపించడం లేదని ఆయన దుయ్యబట్టారు. చేతికి అంది వచ్చిన కొడుకు ప్రమాదవశాత్తు చనిపోతే, ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి వచ్చిన రూ. 5 లక్షల్లో రూ.2.50 లక్షలు తనకు ఇవ్వాలని కొందరు మంత్రులు అడుగుతున్నారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.
పోలవరం ప్రాజెక్ట్‌ను చిన్న బ్యారేజ్‌గా మార్చే కుట్ర:
పోలవరం ప్రాజెక్టు గతిని పూర్తిగా మార్చి వేసేలా వైసీపీ ప్రభుత్వం కేంద్రం వద్ద అంగీకారం తెలిపిందని నాదెండ్ల ఆరోపించారు. ఇటీవల పవన్ కళ్యాణ్ , తాను కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో రెండు గంటల సమావేశంలో పోలవరం గురించి ఆయన చెప్పిన విషయాలు మమ్మల్ని విస్తుపోయేలా చేశాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ఎత్తును 41.15 మీటర్లకు కుదించి ఒప్పుకోవడంతోనే కేంద్రం ఈ మధ్యకాలంలో నిధులు విడుదల చేసిందని నాదెండ్ల పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును ప్రకాశం బ్యారేజ్ తరహాలో చేయడానికి వైసీపీ సిద్ధం అయ్యిందని.. దీనివల్ల రెండు కాలువలకు కూడా నీరు అందే పరిస్థితి ఉండదని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై వైసీపీ కేంద్రం వద్ద ఒప్పుకున్న అసలు విషయాలను ప్రజలకు తెలియజేయాలని.. వైసీపీ ఈ విషయంలో నిజాలు దాచిందని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఎత్తిపోతల పథకాలు పెట్టి ఇప్పటికే వేల కోట్లు ఖర్చు చేశారు తప్ప ప్రజలకు వీటి వల్ల ప్రయోజనం చేకూరలేదన్నారు. అతి పెద్ద బహుళార్థ సాధక పోలవరం ప్రాజెక్టు సైతం చిన్న బ్యారేజీ తరహాలో నిర్మించేలా వైసీపీ ప్రభుత్వం ఒప్పుకుందని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.
కౌలు రైతుల కోసం ప్రత్యేక చట్టం తెస్తాం:
జనసేన ప్రభుత్వం పూర్తి స్థాయిలో రైతు ప్రభుత్వంగా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. కౌలు రైతుల భరోసా యాత్ర కోసం కడపకు వెళ్లినప్పుడు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలో 42 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధించిందన్నారు. ముఖ్యమంత్రి గొప్ప నాయకుడు అయితే సొంత నియోజకవర్గంలోని రైతులకు ఏమాత్రం ఎందుకు ఉపయోగపడలేకపోయారని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. కౌలు రైతుల కష్టాలను అత్యంత దగ్గరగా చూసిన పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే కౌలు రైతుల అభ్యున్నతి కోసం ప్రత్యేక చట్టం తీసుకువస్తామని నాదెండ్ల స్పష్టం చేశారు. రైతులు పండించిన పంటను అమ్ముకునేందుకు పూర్తి భరోసాతో, భవిష్యత్తుపై నమ్మకంతో కష్టపడేలా చూస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రజల కోసం ఒక బలమైన మార్పు కోసం జనసేన పార్టీకి అండగా నిలబడాలని.. అంధకారంతో నిండిపోయిన ఆంధ్రాలో వెలుగులు నింపేలా అంతా సమష్టిగా ప్రయత్నిద్దామని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.
జనసేన కార్యకర్తను పరామర్శించిన నాదెండ్ల :
అంతకుముందు తెనాలి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించి రైతులను, మహిళలను పలకరించి వారి సమస్యలు తెలుసుకున్నారు నాదెండ్ల మనోహర్. బుర్రిపాలెంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. ఇటీవల ప్రమాదంలో గాయపడిన కాజీపేట గ్రామానికి చెందిన క్రియాశీలక సభ్యుడైన గద్దె వెంకట సత్యనారాయణను పరామర్శించి, వైద్య ఖర్చులకి సంబంధించి రూ.50 వేల బీమా చెక్కు అందచేశారు మనోహర్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com