Janasena : పార్టీ బలోపేతమే లక్ష్యం.. జనసైనికులకు, వీర సైనికులకు అవగాహనా తరగతులు : నాదెండ్ల మనోహర్
- IndiaGlitz, [Wednesday,June 29 2022]
వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. దీనిలో భాగంగా వరుస సమీక్షా సమావేశాలతో పాటు నేతలు, కేడర్ అభిప్రాయాలను తీసుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు, పవన్ కళ్యాణ్ ఆశయాలను, సిద్ధాంతాలను గ్రామగ్రామాన వివరించేందుకు పార్టీ క్రియాశీలక సభ్యులకు ప్రత్యేక అవగాహన, పునశ్చరణ తరగతులను నిర్వహించబోతున్నట్లు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యువత, వీర మహిళలు చేసిన కృషి అనిర్వచనీయమని ఆయన ప్రశంసించారు.
సభ్యత్వ నమోదులో జనసైనికులు, వీర మహిళలు కీలకపాత్ర:
జనసేన కేంద్ర కార్యాలయంలో మంగళవారం నాదెండ్ల మాట్లాడుతూ .. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, 3.50 లక్షల మంది క్రీయాశీలక సభ్యులను చేర్చేందుకు జనసైనికులు, వీరమహిళలు చేసిన కృషి అద్భుతమన్నారు. రాజకీయాల్లో ఇది గొప్ప స్ఫూర్తిమంతమైన కార్యక్రమంగా నాదెండ్ల మనోహర్ అభివర్ణించారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను, ఆయన భావజాలాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో వారు విజయం సాధించారని ఆయన అన్నారు. దీనికి అనుగుణంగా పార్టీ సిద్ధాంతాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు, పార్టీని ఎలా బలోపేతం చేయాలన్న దానిపై క్రియాశీలక సభ్యులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
తొలుత వీర మహిళలకు ప్రత్యేక అవగాహనా కార్యక్రమాలు:
దీనిలో భాగంగా జులై 2వ తేదీన మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని తొలుత వీర మహిళలతో నిర్వహించేందుకు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ఎంపిక చేసిన వీర మహిళలు ఈ తరగతులకు హాజరు కావాలని నాదెండ్ల సూచించారు. 2వ తేదీ ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగే ఈ పునశ్చరణ తరగతుల్లో వివిధ రంగాల నిపుణులు పాల్గొంటారని ఆయన తెలిపారు. పార్టీకి మరింత ఉత్తేజం నింపేలా, క్షేత్రస్థాయిలో ఎలా పనిచేయాలనే విషయాలను వివరిస్తారని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. భవిష్యత్ కార్యాచరణను విపులంగా చెప్పడంతో పాటు గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఎలా పనిచేయాలో చర్చిస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వచ్చే ఆరు నెలల్లో ఓ గొప్ప యజ్ఞంలా ముందుకు తీసుకెళ్లాలని.. ప్రతి జిల్లా, నియోజకవర్గంలో ఉండే క్రియాశీలక సభ్యులకు ఈ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు వరుసగా ఉంటాయని నాదెండ్ల తెలిపారు.