Nadendla Manohar:ఇప్పటంలో మళ్లీ ఇళ్ల కూల్చివేతలు.. జగన్ కళ్లలో ఆనందం కోసమే : నాదెండ్ల మనోహర్ ఆగ్రహం
- IndiaGlitz, [Saturday,March 04 2023]
గుంటూరు జిల్లా ఇప్పటంలో అధికారులు మరోసారి ఇళ్ల కూల్చివేతలను ప్రారంభించడంతో ఉద్రిక్తత నెలకొంది. శనివారం ఉదయం 12 ఇళ్ల ప్రహరీ గోడలను మంగళగిరి- తాడేపల్లి నగరపాలక సంస్థ అధికారులు రెండు జేసీబీల సాయంతో కూలగొట్టారు. దీంతో ఆ ఇళ్ల యజమానులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అయినప్పటికీ పటిష్ట పోలీస్ బందోబస్త్ మధ్య అధికారులు ఇళ్ల కూల్చివేతలను కొనసాగించారు. అంతకుముందే గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులను మోహరించారు. గ్రామ సరిహద్దుల్లోనూ పికెటింగ్ ఏర్పాటు చేశారు. గ్రామస్తులను పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. తమ గ్రామానికి 70 అడుగుల రోడ్డు ఎందుకని గ్రామస్తులు .. పోలీసులు, అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఇదే సమయంలో జనసేన పార్టీ ఇప్పటం గ్రామ అధ్యక్షుడి నివాసాన్ని కూల్చేందుకు అధికారులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
పొద్దున్నే ఇప్పటం మీద పడ్డారు :
మరోవైపు ఇప్పటంలో మరోసారి ఇళ్ల కూల్చివేతలకు అధికార యంత్రాంగం సిద్ధం కావడంతో జనసేన పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటం గ్రామంలో ఇళ్లు కూల్చివేస్తూ వైసీపీ ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతోందని దుయ్యబట్టారు. మచిలీపట్నంలో త్వరలో జరగనున్న పార్టీ ఆవిర్భావ సభకు భూములిచ్చిన రైతులను భయపెట్టేందుకే మరోసారి ప్రభుత్వం ఈ చర్యలకు దిగిందని నాదెండ్ల ఆరోపించారు. విశాఖలో పెట్టుబడుల సదస్సు నేపథ్యంలో రెండు రోజుల పాటు ఎలాంటి రాజకీయ విమర్శలు చేయనన్న పవన్ నిర్ణయాన్ని ఆసరాగా తీసుకుని ఇప్పటం మీద పడ్డారని మనోహర్ దుయ్యబట్టారు. జగన్ రెడ్డి పైశాచికానందం కోసమే ఇప్పటంలో మరోసారి ఇళ్లు కూల్చివేతలకు దిగారని ఆయన ఆరోపించారు. శని, ఆదివారాల్లోనే కూల్చివేతలకు ఎందుకు దిగుతున్నారని నాదెండ్ల ప్రశ్నించారు.
గ్రామం మధ్యలో 140 అడుగుల రోడ్డు అవసరమా:
వైసీపీకి చెందిన స్థానిక శాసనసభ్యుడి ఇంటి ముందు 40 అడుగుల రోడ్డు వుందా అని ఆయన నిలదీశారు. పచ్చటి గ్రామాల్లో మంటలు పెడుతున్నారని.. పరిపాలనా దక్షత లేక ఇలాంటి అనవసరమైన కార్యక్రమాలకు సమయం వృథా చేస్తున్నారని మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామం మధ్యలో 140 అడుగుల రోడ్డు వేస్తామంటే ఎలా అర్ధం చేసుకోవాలని ఆయన నిలదీశారు. ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతలను జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని నాదెండ్ల మనోహర్ తెలిపారు.