Janasena : సంక్షేమ పథకాలు అందడం లేదంటే కేసులు పెడతారా : జగన్ ప్రభుత్వంపై నాదెండ్ల ఫైర్
Send us your feedback to audioarticles@vaarta.com
వైసీపీ ప్రభుత్వం నిర్వహిస్తోన్న గడప గడపకు కార్యక్రమంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తమకు రావాల్సిన సంక్షేమ పథకాలు రావడం లేదన్న విషయాన్ని శాసన సభ్యులకు విన్నవించుకున్న వారి మీద అక్రమ కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, వేపనపల్లి గ్రామంలో గడప గడపకు కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు ఎం.ఎస్.బాబు దృష్టికి తమకు సంక్షేమ పథకాలు అందటం లేదని చెబితే కేసులుపెట్టి వేధించడం అప్రజాస్వామికమని మనోహర్ దుయ్యబట్టారు.
ప్రశ్నిస్తే అట్రాసిటీ కేసులు :
జనసేన పార్టీ కుటుంబానికి చెందిన ఐనా జశ్వంత్ ఇంటికి ఎమ్మెల్యే వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి ఆరా తీస్తే సంక్షేమ పథకాలు అందడం లేదని చెప్పారన్న అక్కసుతో 16 ఏళ్ళ ఆ యువకుడిని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లి అరెస్టు చేయడాన్ని నాదెండ్ల ఖండించారు. జశ్వంత్ కుటుంబానికి మద్దతుగా వెళ్లిన తమ పార్టీ నాయకుల మీద అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసులు మోపడం వైసీపీ ప్రభుత్వం వైఖరి ఎలా ఉందో తెలియచేస్తుందని దుయ్యబట్టారు.
జనసేన మద్ధతుదారులకు వైసీపీ పథకాలు అందవట.. ఎమ్మెల్యేనే చెబుతారా :
గడప గడపకు కార్యక్రమంలో ప్రశ్నించిన వారిపై ఎమ్మెల్యే అనుచరులు బెదిరింపులకు దిగడం, జనసేన పార్టీ మద్దతుదారులకు వైసీపీ పథకాలు అందవని శాసన సభ్యుడే బాహాటంగా చెప్పడం అధికార పార్టీ దాష్టికాలకు అద్ధం పడుతున్నాయని నాదెండ్ల మనోహర్ ఎద్దేవా చేశారు. పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ నాయకుల మీద పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అక్రమ కేసులో అరెస్టు అయిన పార్టీ నాయకులకు జనసేన పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలా అండగా ఉంటుందని.. ఏ ఒక్కరూ అధైర్య పడొద్దని నాదెండ్ల మనోహర్ భరోసా ఇచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com