Janasena Party : వచ్చీ రాగానే ఆ చట్టాన్ని మార్చేశారు.. మరి కౌలు రైతుల గతేంటీ : జగన్పై నాదెండ్ల ఆగ్రహం
Send us your feedback to audioarticles@vaarta.com
రాష్ట్రంలో కౌలు రైతుల గుర్తింపు జరగడం లేదన్నారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. గురువారం గుంటూరులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా ఉన్నపుడు కౌలు రైతుల కోసం ఒక అద్భుతమైన చట్టం తీసుకొచ్చామని గుర్తుచేశారు. ఆ చట్టంలో భూ యజమానులతో సంబంధం లేకుండా కౌలు రైతుకు మేలు జరిగేలా కొన్ని కీలక అంశాలను ఉంచామని నాదెండ్ల వెల్లడించారు. రుణాలతో పాటు ప్రభుత్వ రాయితీలు, విత్తన సబ్సీడీలు, యంత్ర పరికరాలకు సంబంధించిన సబ్సీడీలు నేరుగా కౌలు రైతులకు అందేవని ఆయన వివరించారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ చట్టానికి ఈ ముఖ్యమంత్రి పూర్తిస్థాయి మార్పులు తీసుకొచ్చారని నాదెండ్ల దుయ్యబట్టారు. భూ యజమాని 11 నెలల రెంటల్ అగ్రిమెంటును కౌలు రైతుకు ఇస్తేనే వారిని గుర్తించే ప్రక్రియ ప్రారంభం అవుతుందని.. అంతేకాకుండా భూ యజమానుల ఆధార్ కార్డును ఇవ్వాల్సి ఉంటుందని మనోహర్ ఎద్దేవా చేశారు.
యజమానులు ఆధార్ కార్డ్ ఇవ్వడం లేదు:
దీంతో భూ యజమానులెవరూ దీనికి ముందుకు రావడం లేదని... ఫలితంగా కౌలు రైతుల గుర్తింపు జరగడం లేదని నాదెండ్ల ఫైర్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 70 శాతం కౌలు రైతులే కనిపిస్తారని.. డెల్టా ఏరియాల్లో ఏకంగా 80 శాతం కౌలు రైతులే వున్నారని, వారికి గుర్తింపు లేదని మనోహర్ తెలిపారు. 2011లోనే 25 లక్షల మంది కౌలు రైతులు ఉన్నట్లు ప్రభుత్వ లెక్కల్లో తేలిందని... మరిప్పుడు ఆ సంఖ్య కేవలం 16 లక్షలకు పడిపోవడంలో ఆంతర్యం ఏమిటని నాదెండ్ల ప్రశ్నించారు. ప్రభుత్వం చెబుతున్న సీసీఆర్సీ కార్డుల పంపిణీలోనూ సరైన సహేతుకత లేదని... ఒక్క గుంటూరు జిల్లాలోనే 2.30 లక్షల మంది కౌలు రైతులు ఉంటే, ప్రస్తుతం 1.61 లక్షల మంది కౌలు రైతులే ఉన్నట్లు చెబుతున్నారని మనోహర్ మండిపడ్డారు.
వ్యవసాయం అంటే బాబోయ్ అంటున్నారు:
68 వేలు సీసీఆర్సీ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంటే కేవలం 53 వేల మందికి మాత్రమే కార్డులు ఇచ్చారని ఆయన విమర్శించారు. ప్రకాశం జిల్లాలో 1.2 లక్షల మంది కౌలు రైతులు ఉంటే సీసీఆర్సీ కార్డులు 35 వేలు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకున్నారని.. కానీ కేవలం 18 వేలు కార్డులే ఇచ్చారని నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీఆర్సీ కార్డులు ఇచ్చిన ఈ రైతులేనా సీఎం చెబుతున్న అర్హత ఉన్న రైతులు..? వీరేనా మీరు లెక్కలు చెప్పే రైతులు..? పల్నాడు జిల్లాలో వారం రోజుల్లో ఏకంగా 5 ఆత్మహత్యలు జరిగాయని నాదెండ్ల తెలిపారు. ఈ పరిస్థితి ఈ ముఖ్యమంత్రికి అర్థం అవుతుందో లేదో కూడా తెలియదని.. వ్యవసాయం అంటే బాబోయ్ అని పరిస్థితి వచ్చిందని మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వ తీరుతో ఇప్పటికీ రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని నాదెండ్ల చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments