Janasena : జగన్‌వి గొప్పలే.. 10 శాతం కూడా భూసేకరణ కాలేదు : రామాయపట్నం పోర్ట్ నిర్మాణంపై నాదెండ్ల వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
రామాయపట్నం పోర్టు నిర్మాణంపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. రామాయపట్నం పోర్టు నిర్మాణం జరిగి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో చక్కటి మౌలిక సదుపాయాలు అభివృద్ది చెందుతాయంటే జనసేన స్వాగతిస్తుందన్నారు. కానీ ఈ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో వైసీపీ ప్రభుత్వ వ్యవహార శైలి, ముందుకు వెళ్తున్న తీరుపై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. ఈ పోర్టు ద్వారా ఊహించని విధంగా పెట్టుబడులు వచ్చేస్తాయని, యువతకు వేలల్లో ఉపాధి లభిస్తుందని ముఖ్యమంత్రి పదేపదే చెప్పుకొచ్చారని, అయినా సందేహాలేనని నాదెండ్ల మనోహర్ దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గురించి, ఆయన చిత్తశుద్ది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కదా అంటూ మనోహర్ సెటైర్లు వేశారు.
రామాయపట్నానికి 2020లోనే కేబినెట్ ఆమోదం:
వాస్తవంగా పోర్టు నిర్మాణం కోసం 2020 మార్చిలో రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందని ఆయన గుర్తుచేశారు. 2021 ఫిబ్రవరిలో పనులు ప్రారంభమవుతాయని, 2023 సంవత్సరానికి కల్లా ఫేజ్-1 పనులు పూర్తవుతాయని స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించారని నాదెండ్ల తెలిపారు. రామాయపట్నం పోర్టు నిర్మాణం కోసం 3,634 ఎకరాలు అవసరమైతే ప్రభుత్వం 3,093 ఎకరాలు సేకరించాల్సి ఉందన్నారు. తమ దగ్గరున్న సమాచారం ప్రకారం- ఫేజ్ 1 పనుల కోసం సుమారు 850 ఎకరాలు అవసరమని నాదెండ్ల మనోహర్ తెలిపారు. అయితే ఈ ప్రభుత్వం భూసేకరణ చేసింది ఇప్పటి వరకు కేవలం 255 ఎకరాలేనని.. అంటే 10 శాతం భూసేకరణ కూడా ఈ ప్రభుత్వం పూర్తి చేయలేదని ఆయన చురకలు వేశారు.
రామాయపట్నాన్ని నాన్ మేజర్ పోర్టుగా ఎందుకు నోటిఫై చేశారు:
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం దుగ్గరాజపట్నంలో కేంద్ర ప్రభుత్వమే ఓడరేపు నిర్మిస్తుందని హామీ ఇచ్చిందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. గత ప్రభుత్వ కాలంలోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా మన రాష్ట్రంలో పర్యటించినప్పుడు 3వేల ఎకరాలు సేకరించి ఇస్తే.. సాగరమాల ప్రాజెక్టులో భాగంగా తామే పోర్టు నిర్మిస్తామని చెప్పారని నాదెండ్ల గుర్తుచేశారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వానికి లేఖలు కూడా రాశారని... తరువాత వైసీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. వైసీపీ ప్రభుత్వ కోరిక మేరకు దుగ్గరాజపట్నం, రామాయపట్నం రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వమే పోర్టు నిర్మిస్తుందని నాదెండ్ల తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఒక వైపు మేమే నిర్మిస్తామని స్పష్టంగా చెబుతుంటే జగన్ ప్రభుత్వం ఎందుకు రామాయపట్నం పోర్టును నాన్ మేజర్ పోర్టుగా నోటిఫై చేసిందని ఆయన ప్రశ్నించారు. దానిని మేజర్ పోర్టుగా నోటిఫై చేసుంటే విభజన చట్టంలో ఉన్న హామీ మేరకు కేంద్ర ప్రభుత్వమే ప్రతి పైసా ఖర్చు చేసి పోర్టును నిర్మించే బాధ్యత తీసుకునేదని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
ఆ వెయ్యి కోట్లు ఏమయ్యాయి :
రామాయపట్నం ఓడరేవుతో సహా మౌలిక సదుపాయాల కోసం ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ 3 బిలియన్ డాలర్లు అంటే రూ. 24వేల కోట్లు రుణం ఇచ్చేందుకు అంగీకరించిందని ప్రభుత్వం గొప్పగా ప్రకటించుకుందన్నారు. పోర్టు నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని ఏపీ మారిటైమ్ బోర్డును స్థాపించి, నిర్మాణ బాధ్యతలు దానికి అప్పగించారని నాదెండ్ల వెల్లడించారు. పోర్టు నిర్మాణానికి రూ. 2079 కోట్లు అవసరం కాగా, అందులో ప్రభుత్వం పెట్టాల్సిన వాటా రూ. 1450 కోట్లని చెప్పారు. ఈ నిధులు ప్రభుత్వం వద్ద లేకపోవడంతో ఆ మొత్తాన్ని లోన్లు ద్వారా సమీకరించే బాధ్యత కూడా ఏపీ మారిటైమ్ బోర్డు తీసుకోవాలని ప్రభుత్వం జీవో ఇచ్చిందని నాదెండ్ల గుర్తుచేశారు. గంగవరం పోర్టులో ప్రభుత్వం వాటా అమ్ముకోవడంతో రూ.650 కోట్లు వచ్చాయని.. అలాగే మత్స్యకారులకు తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం కోసం రూ.350 కోట్లు సమీకరించారని మనోహర్ పేర్కొన్నారు. ఈ రూ.వెయ్యి కోట్లు నిధులు ఏమయ్యాయి? ఎటుపోయాయని ఆయన ప్రశ్నించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com