Janasena : జనవాణికి అద్భుత స్పందన.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం: నాదెండ్ల మనోహర్
Send us your feedback to audioarticles@vaarta.com
సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడంతో జనసేన పార్టీ “జనవాణి -జనసేన భరోసా” కార్యక్రమం చేపట్టిందన్నారు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. ఆదివారం భీమవరంలో జనవాణి - జనసేన భరోసా కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 10గం. నుంచి పవన్ కళ్యాణ్ అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పీఏసీ సభ్యులు కొణిదెల నాగబాబు పాల్గొన్నారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. జనవాణి కార్యక్రమానికి సామాన్య ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు.
రేపటి నుంచి అర్జీల పరిష్కార ప్రక్రియకు శ్రీకారం:
విజయవాడలో జరిగిన రెండు విడతల్లో దాదాపు 1000 అర్జీలు వచ్చాయని.. భీమవరంలో 497 అర్జీలు వచ్చాయని మనోహర్ తెలిపారు. పంచాయతీ రాజ్, ఆరోగ్య, వ్యవసాయ, రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ శాఖల నుంచి ఎక్కువ అర్జీలు వచ్చాయని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా భీమవరం పట్టణంలో నెలకొన్న స్థానిక సమస్యలు, డంప్ యార్డ్ గురించి ప్రజలు అర్జీలు ఇచ్చారని నాదెండ్ల తెలిపారు. అర్జీల పరిష్కార ప్రక్రియ రేపటి నుంచి మొదలవుతుందని.. వచ్చిన అర్జీలను సంబంధిత ప్రభుత్వ శాఖాధిపతులకు పంపిస్తామని మనోహర్ వెల్లడించారు. వాటితో పాటు జనసేన పార్టీ తరఫున లెటర్స్ రాస్తామని, వారం రోజుల తరువాత అర్జీకి సంబంధించిన అప్ డేట్ ను సంబంధిత వ్యక్తికి మెయిల్, వాట్సప్ ద్వారా అందిస్తామని నాదెండ్ల స్పష్టం చేశారు.
జనవాణి కోసం జనసైనికులు, వీరమహిళలు కష్టపడ్డారు:
వాతావరణం, పరిస్థితులు అనుకూలించకపోయినా ఏజెన్సీ ప్రాంతాల నుంచి సైతం చాలా మంది తరలివచ్చి అర్జీలు ఇచ్చారని... వారి నమ్మకాన్ని జనసేన పార్టీ తప్పక నిలబెట్టుకుంటుందని మనోహర్ పేర్కొన్నారు. వైసీపీ నాయకుల అరాచకాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని.. వాటిపై కూడా పిటీషన్లు వచ్చాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జనవాణి కార్యక్రమం విజయవంతం అవ్వడానికి పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు చాలా కష్టపడ్డారని, వారందరికీ పార్టీ తరఫున మనోహర్ ధన్యవాదాలు తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com