వైసీపీలో చేరిన జనసేన ఎమ్మెల్యే రాపాక తనయుడు...
- IndiaGlitz, [Saturday,December 05 2020]
జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తనయుడు రాపాక వెంకట్రామ్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వెంకట్రామ్ వైసీపీ కండువా కప్పుకున్నారు. గెలిచింది జనసేన నుంచి అయినా ఆది నుంచి రాపాక వైసీపీ పట్లే తన విధేయతను చాటుతూ వస్తున్నారు. 2019 ఎన్నికల్లో జనసేన ఘోర పరాజయం పాలైంది. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సైతం రెండు చోట్ల పోటీ చేసినప్పటికీ రెండు చోట్ల కూడా పరాజయాన్నే మూటగట్టుకోవాల్సి వచ్చింది. కానీ ఆ పార్టీ నుంచి రాపాక వరప్రసాద్ ఒక్కరు మాత్రమే విజయం సాధించారు.
ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి జనసేనకు మారి పార్టీ టికెట్ దక్కించుకుని విజయం సాధించిన రాపాక.. ఆ తర్వాత వల్లమాలిన ప్రేమను వైసీపీపై చూపిస్తున్నారు. సమయం దొరికిందంటే సీఎం జగన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అసెంబ్లీ వేదికగా కూడా ఎన్నో సార్లు జగన్‌ను పొగిడే కార్యక్రమం పెట్టుకున్నారు. అంతేకాదు.. రాజ్యసభ ఎన్నికల్లో సైతం వైసీపీకే ఓటేశానని బహిరంగంగా ప్రకటించారు. అయితే ఏదైనా యాక్షన్ తీసుకుంటే ఉన్న ఒక్కగానొక్క ఎమ్మెల్యే చేజారి పోతారనో.. మరేదైనా కారణమో కానీ రాపాక విషయంలో పవన్ మాత్రం నోరు మెదపడం లేదు.
తన తండ్రితో కలిసి వెళ్లి వెంకట్రామ్ వైసీపీలో చేరడం గమనార్హం. ప్రస్తుతం వైసీపీలో చేరే అవకాశం లేక రాపాక ఆగుతున్నారు కానీ లేదంటే ఆయన కూడా ఈపాటికే వైసీపీ కండువా కప్పుకుని ఉండేవారని తెలుస్తోంది. పదవికి రాజీనామా చేసి వస్తేనే వైసీపీలో చేర్చకుంటానని జగన్ గతంలో చెప్పినందునే రాపాకతో పాటు పలువురు టీడీపీ నేతలు పరోక్షంగా ఆ పార్టీకి మద్దతు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాపాక తాను చేరకున్నా తన కుమారుడిని వైసీపీలో జాయిన్ చేశారు.