Janasena: హైదరాబాద్‌లో మూసీ నది పాలైన జనసేన, టీడీపీ పరువు

  • IndiaGlitz, [Monday,December 04 2023]

అమ్మకు అన్నం పెట్టలేని వాడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడు అన్న చందంగా సొంత రాష్ట్రంలోనే దిక్కు లేదు కానీ వేరే రాష్ట్రంలో పోటీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్. గత ఎన్నికల్లో ఏపీలోనే డిపాజిట్లు కోల్పోయిన జనసేన తెలంగాణలో పోటికి దిగింది. ఏం లాభం పోటీ చేసిన 8 నియోజకవర్గాల్లో కనీసం డిపాజిట్లు కూడా అందుకోలేక ఘోర పరాభవం పొందింది. స్వయం పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం చేసిన ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది సారీ సారీ నాలుగో స్థానంలో కూడా నిలవలేకపోయింది. సెటిలర్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోటీ చేసినా ఫలితం లేకుండా పోయింది.

ఏపీలో ఒక్క సీటు అయినా గెలుస్తుందా..?

కనీసం హైదరాబాద్‌ జిల్లాలోని కూకట్‌పల్లి నియోజకవర్గంలో అయిన గెలిచి పరువు నిలబెట్టుకోవాలని పోరాటం చేసింది. అయినా కానీ తెలంగాణ ప్రజలతో పాటు ఏపీ సెటిలర్స్ కూడా ఘోరంగా తిరస్కరించారు. దీంతో త్వరలోనే జరగనున్న ఏపీ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు అయినా గెలుస్తుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. పరిస్థితిని ముందుగానే గ్రహించిన పవన్ కళ్యాణ్.. క్యాడర్ జారిపోకుండా హుటాహుటిన పార్టీ విస్తృతస్థాయి సమావేశం పెట్టి జాగ్రత్తపడ్డారు. అంతేకాకుండా పార్టీలో ఉండే వాళ్లు ఉండండి.. వెళ్లే వాళ్లు వెళ్లండంటూ తీవ్ర అసహనానికి గురయ్యారు.

గ్రేటర్‌ పరిధిలో బీఆర్ఎస్‌కు పట్టం. .

ఇదిలా ఉంటే హైదరాబాద్‌ను తామే నిర్మించాం.. ఐటీ తెచ్చింది తామే.. ఔటర్‌ రింగ్ రోడ్డు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టు కట్టాం.. తమ నాయకుడు లేకపోతే హైదరాబాద్‌ అభివృద్ధి చెందేదో కాదంటూ ప్రగల్భాలు పలికే టీడీపీ నేతలు పరోక్షంగా కాంగ్రెస్‌కు మద్దతు పలికారు. అలాగే చంద్రబాబు అరెస్టుపై కేసీఆర్ కుటుంబం సరిగా స్పందించలేదని ఆగ్రహించిన తెలుగు తమ్ముళ్లు, కమ్మసామాజిక వర్గానికి చెందిన నేతలు బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పనిచేశారు. అయినా కానీ గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో బీఆర్ఎస్ పార్టీకే సెటిలర్స్ పట్టం కట్టారు. దీనిని బట్టి చూస్తే హైదరాబాద్ అభివృద్ధి చేశామంటూ చెప్పుకునే పచ్చ నేతల మాటలు ఎవరూ నమ్మడం లేదని స్పష్టంగా నిరూపితమైంది.