రైజింగ్‌లో పవన్ గ్రాఫ్.. కడుపు మంటతోనే దత్తపుత్రుడంటూ వ్యాఖ్యలు : జగన్‌పై జనసేన నేత విజయ్ కుమార్ ఆగ్రహం

  • IndiaGlitz, [Wednesday,May 18 2022]

వైసీపీ ప్రభుత్వంపై, ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై మండిపడ్డారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరు విజయ్ కుమార్. మంగళవారం యలమంచిలి జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియాలో సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల పవన్ కల్యాణ్‌పై సీఎం చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. మాట్లాడితే డబ్బులు పంచుతున్నమని.. తమది అద్భుతమైన ప్రభుత్వమని జగన్ చెబుతున్నారని, మరి రైతు ఆత్మహత్యలు ఎందుకు ఆగడం లేదని విజయ్ కుమార్ ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంపై రూ.8 కోట్ల అప్పు వుందని.. ఇది భవిష్యత్ తరాలకు తలకు మించిన భారమేనని విజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్‌కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి సీబీఐ దత్తపుత్రుడికి నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. ప్రతి సభలోనూ పవన్ పేరు ప్రస్తావించకుండా ఉండలేకపోతున్నారని.. సీఎం హోదాలో ప్రజా సమస్యలను వదిలేసి పవన్‌ని దత్తపుత్రుడిగా పిలుస్తూ భుజాలు చరుచుకుంటున్నారని విజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ చేపట్టిన కౌలు రైతుల భరోసా యాత్రలో ఎన్నో ధీనగాధలు, రైతుల వెతలు కళ్లకు కడుతున్నాయని, వాటిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల లెక్కలను ప్రభుత్వంలో అంతర్భాగం అయిన పోలీస్ శాఖ నివేదికలు చూస్తే తెలుస్తుందని విజయ్ కుమార్ దుయ్యబట్టారు. అసలు కౌలు రైతుల ఆత్మహత్యలే లేవని జగన్ అంటున్నారని... మరి పోలీసులు చెప్తుంది తప్పా..? లేక సీఎం అబద్ధాలు ఆడుతున్నారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ రైతుల కోసం వెచ్చిస్తున్న ప్రతి రూపాయి ఆయన కష్టార్జితమని.. ఆయన నుంచి సహాయం పొందిన కౌలు రైతు కుటుంబాలను ఈ ప్రభుత్వం కౌలు రైతు కుటుంబాలు కాదు అని ప్రకటించగలదా అని విజయ్ కుమార్ ప్రశ్నించారు.

2019లో కౌలు రైతులందరినీ గుర్తిస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ఆ హామీని పూర్తిగా గాలికి వదిలేశారని ఆయన ధ్వజమెత్తారు. మొదట 25 లక్షల మంది కౌలు రైతులు రాష్ర్టంలో ఉన్నారని చెప్పిన వ్యక్తి .. ఇప్పడు కేవలం రాష్ర్టంలో 5 లక్షల మంది మాత్రమే ఉన్నారని చెప్పడం అత్యంత దురదష్టకరమన్నారు. కేంద్రం ఇచ్చే డబ్బును తాను ఇచ్చిన డబ్బుగా చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి .. దానిలోనూ కులాలు, గ్రూపులు కట్టి సాయం చేయడం సిగ్గుచేటని విజయ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రాష్ర్టంలో మహిళలపై రోజుకో అఘాయిత్యం జరుగుతోందని.. శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయని, దీనిపై దృష్టి పెట్టడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రి కూడా ఈ విషయమై ఇష్టానుసారం మాట్లాడుతున్నారని... రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని, ప్రతి లీటర్ పెట్రోలు, డీజిల్ పై రూపాయి మేర రోడ్డు సెస్ వసూలు చేస్తున్నారని విజయ్ కుమార్ ఫైరయ్యారు. ప్రతిసారి పవన్ కళ్యాణ్ రెండుచోట్ల ఓడిపోయారని అంటున్నారని.. ప్రజాస్వామ్యంలో గెలుపు, ఓటమి సాధారణమని ఆయన వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో మీ అమ్మ గారినే గెలిపించుకోలేకపోయారని.. అప్పుడు ఏం చేశారని విజయ్ కుమార్ ప్రశ్నించారు.

కొత్త మంత్రి గుడివాడ అమర్నాథ్ తన తీరును మార్చుకోవాలని... మూతపడిన తుమ్మపాల షుగర్ ఫాక్టరీని తిరిగి తెరిపించే బాధ్యత జనసేన పార్టీగా మేం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. దానిపై ఉన్న బకాయిలపై దృష్టి సారిస్తామని.. కచ్చితంగా రైతులకు మేలు చేసేందుకు ముందుడుగు వేస్తామని విజయ్ కుమార్ తెలిపారు. నియోజకవర్గంలో 600 ఎకరాల భూమి కబ్జాకు గురైందని.. దీనిపై అన్ని రకాల సాక్షాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. వీటిని ప్రభుత్వానికి అందిస్తామని.. వెంటనే భూమిని కబ్జా కోరల నుంచి కాపాడాల్సిన అవసరం ఉందని విజయ్ కుమార్ పేర్కొన్నారు.