ఇసుక మాఫియా చేతిలో జనసైనికుడి దారుణ హత్య .. ప్రశ్నిస్తే చంపేస్తారా : జనసేన నేత తమ్మిరెడ్డి శివశంకర్
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలో ఇసుక మాఫియా చేతిలో సదాశివుని రాజేశ్ అనే జనసేన కార్యకర్త హత్యకు గురికావడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై జనసేన వర్గాలు భగ్గుమంటున్నాయి. తాజాగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ .. ఈ హత్యను తీవ్రంగా ఖండించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇసుక అక్రమ రవాణాను ప్రశ్నించినందుకు రాజేష్‌ను హత్య చేయడం దురదృష్టకరమన్నారు. ఈ హత్య ప్రభుత్వ తీరుకు అద్దం పడుతోందని ఆయన దుయ్యబట్టారు. ప్రకృతి వనరులను రక్షించాల్సిన ప్రభుత్వమే అక్రమ ఇసుక దోపిడిని ప్రోత్సహిస్తోందని శివశంకర్ ఆరోపించారు.
రాజేశ్ హత్యకు కారకులు ఎవరు :
సదాశివుని రాజేష్ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భావజాలం పట్ల నమ్మకంతో పార్టీలో పని చేస్తున్నారని పేర్కొన్నారు. ఓ సామాజిక స్పృహ, బాధ్యతతో తన ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణాను ప్రశ్నించినందుకు అతన్ని హత్య చేయడం దారుణమన్నారు. బాధ్యత గల వ్యక్తిగా ప్రశ్నిస్తే చంపేస్తారా అంటూ శివశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన మీద పోలీసులు తీవ్రమైన చర్యలు తీసుకోవాలని.. ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. రాజేష్ హత్యకు కారకులు ఎవరు? వెనుక ఉన్న అక్రమార్కులు ఎవరు? ఇద్దరు లొంగిపోయారని పోలీసులు చెబుతున్నారని శివశంకర్ ప్రశ్నలు సంధించారు.
నిందితులపై చర్యలు తీసుకోకుంటే ఉద్యమమే:
హత్యకు ప్రేరేపించిన వ్యక్తులు ఎవరో విచారణ జరిపి వారిని అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జరిగిన ఘటనకు సంబంధించి వాస్తవాలు తెలుసుకుంటున్నామన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకోవాల్సిన ఎ.డి. మైన్స్ జియాలజీ, అధికార యంత్రాంగం ఏం చేస్తోంది? హత్య జరిగాక పోలీసులు తీసుకున్న చర్యలు ఏంటి? అనే అంశాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని శివశంకర్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జనసేన పార్టీ తీవ్ర ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. రాజేష్ హత్య లాంటి దుర్మార్గాలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయని.. ఇప్పుడు శ్రీకాకుళం పట్టణంలో ఆ సంస్కృతిని ప్రవేశపెట్టారని శివశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తోందన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com