Janasena : గుడివాడలో ఒక్క రోడ్డయినా బాగుందా.. హైదరాబాద్‌లో పనేంటీ : కొడాలి నానిపై జనసేన నేత శ్రీకాంత్ ఆగ్రహం
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల పరిస్థితి, మాజీ మంత్రి కొడాలి నానిపై గుడివాడకు చెందిన జనసేన నేన బూరగడ్డ శ్రీకాంత్ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలో అయినా రోడ్లు 10 మేర అధ్వానంగా ఉంటాయి.. మన రాష్ట్రంలో మాత్రం 10 శాతం మేర మాత్రమే బాగుంటాయని సెటైర్లు వేశారు. రాష్ట్రంలో రోడ్ల దుస్థితిని ప్రభుత్వానికి తెలియజేసేందుకే జనసేన పార్టీ ఆధ్వర్యంలో గుడ్ మార్నింగ్ సీఎం సార్ కార్యక్రమాన్ని నిర్వహించామని శ్రీకాంత్ తెలిపారు. ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేక వెన్నులో వణుకు పుట్టిన సీఎం తన బూతుల ఎమ్మెల్యే కొడాలి నానితో అవాకులుచవాకులు పేలిస్తున్నాడని ఆయన మండిపడ్డారు.
గుడ్ మార్నింగ్ సీఎం సార్ కార్యక్రమంతో జగన్ వెన్నులో వణుకు:
గత మూడేళ్లుగా అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు, సలహాదారులు ముఖ్యమంత్రి కి గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని చెప్పి ఉండవచ్చని.. కానీ తాము చేపట్టిన గుడ్ మార్నింగ్ సీఎం సార్ మాట వింటేనే జగన్‌కు వెన్నులో వణుకు పుట్టుకొచ్చిందని శ్రీకాంత్ దుయ్యబట్టారు. రాష్ట్రంలో రోడ్లు పరిస్థితి జనసేన పార్టీ కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నా, ఈ ప్రభుత్వంలో చలనం లేదని.. దబాయింపులు, బూతులు తప్ప వైసీపీ నాయకులకు మరో పని లేదని ఆయన మండిపడ్డారు. మాట్లాడితే పవన్ కళ్యాణ్ హైదరాబాదులో ఉంటారని చెప్పే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్ని రోజులు నియోజకవర్గం లో ఉంటున్నారో, కుటుంబాన్ని హైదరాబాదులో ఎందుకు పెట్టారో చెప్పాలని శ్రీకాంత్ డిమాండ్ చేశారు.
ఒక్క రోడ్డు బాగున్నా గుడివాడను వదిలిపెట్టేస్తాం:
హైదరాబాదులో గడిపే కొడాలి నాని కూడా పవన్ కళ్యాణ్‌ని విమర్శించడం ఏంటీ అంటూ మండిపడ్డారు. మేము అడిగిన రోడ్ల పరిస్థితి మీద సమాధానం చెప్పాలని.. గుడివాడ నియోజకవర్గంలో ఏ రోడ్డు బాగోలేదని శ్రీకాంత్ ఎద్దేవా చేశారు. ఆఖరికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని ఇల్లు ఉండే రాజేంద్రనగర్ రోడ్డు కూడా అత్యంత దారుణంగా ఉందని చురకలు వేశారు. గుడివాడలో ఏ రోడ్డయినా మెరుగ్గా ఉందా? బాగుంది అని ఒక్క రోడ్డు చూపించినా తాము గుడివాడ వదిలి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నామని శ్రీకాంత్ సవాల్ విసిరారు. అస్తవ్యస్తంగా అధ్వానంగా ఉన్న రోడ్ల సమస్య మీద మాట్లాడమంటే వ్యక్తిగత దూషణలు తప్ప మీకు పాలన చేతకాదుని ఆయన ధ్వజమెత్తారు.
హామీలన్నింటినీ కొడాలి నాని విమర్శించారు:
ఎంతో గొప్పగా నవరత్నాలు అమలు చేశామని చెబుతున్న మీరు.. ప్రతి సంవత్సరం లబ్ధిదారుల సంఖ్యను ఎందుకు తగ్గిస్తున్నారో చెప్పాలని శ్రీకాంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రూ.100 ఉండే మద్యం క్వార్టర్ బాటిల్ రూ.300లకు పెంచేసి ఈ ముఖ్యమంత్రి మద్యం బ్లాక్ మాఫియా ముఖ్యమంత్రిగా మిగిలిపోయారని ఆయన ఆరోపించారు. కల్తీ మద్యం మరణాలు రోజూ చోటు చేసుకుంటున్నా ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యథేచ్చగా కల్తీ మద్యం అమ్ముతూ ఎందరో మృతికి కారణం అవుతున్న ఈ ప్రభుత్వం చేస్తున్న హత్యలను కచ్చితంగా ప్రశ్నిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలవేళ ఎన్నో హామీలు ఇచ్చిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వాటిని పూర్తిగా మర్చిపోయారని విమర్శించారు.
పవన్ జోలికొస్తే.. ప్రజలే బుద్ధి చెబుతారు:
విజయవాడ-బందరు రోడ్డు పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని.. ఫ్లైఓవర్ ప్రారంభం అన్నారు ఇప్పటివరకు అది లేదు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీను నెరవేర్చని మీరు పవన్ కళ్యాణ్‌ను విమర్శించడానికి ఏమాత్రం సరిపోరని శ్రీకాంత్ దుయ్యబట్టారు. మీ ప్రభుత్వం అన్ని మాఫియాల మీద నడుస్తోందని.. దానిమీద చర్చిద్దాం ముందుకు రండి అంటూ సవాల్ విసిరారు. మట్టి మాఫియా, ఇసుక మాఫియా, రేషన్ బియ్యం మాఫియా, విద్యుత్ ఛార్జీలు, బస్సు ఛార్జీలు, ఇంటి పన్ను పెంపు, చెత్త పన్ను గురించి మాట్లాడదాం రావాలని శ్రీకాంత్ నిలదీశారు. మీ పార్టీ తట్టెడు మట్టి రోడ్డుపై పోయదుగాని.. తట్టెడు కేసుల్లో ఉన్న నాయకుల్ని జనసేన పైకి ఉసిగొల్పుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీతి నిజాయితీ ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్‌ని విమర్శిస్తే ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారు శ్రీకాంత్ హెచ్చరించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments