పులివెందుల కేంద్రంగా భీమ్ రావ్ జిల్లా పెట్టండి.. ఆ ముగ్గురే జగన్ని ఒప్పించాలి : జనసేన నేత పోతిన మహేశ్
- IndiaGlitz, [Thursday,May 26 2022]
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరుని వివాదాల్లోకి లాగి వైసీపీ రాజకీయంగా వాడుకుంటోందని ఆరోపించారు జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంటక మహేశ్. గురువారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఖ్యాతిని తగ్గించేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. నిజంగా వైసీపీ ప్రభుత్వానికి ఆయన పట్ల చిత్తశుద్ధి ఉంటే కడప జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని మహేశ్ డిమాండ్ చేశారు. వీలు కాని పక్షంలో 27వ జిల్లాను పులివెందుల కేంద్రంగా ఏర్పాటు చేసి భీమ్ రావ్ జిల్లాగా నామకరణం చేయాలని కోరారు.
ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గాన్ని ఈ విధంగా చేస్తే బాబాసాహెబ్ స్ఫూర్తి వెల్లడవుతుందని ఆయన చురకలు వేశారు. పచ్చటి కోనసీమలో అల్లర్లకు కారణమైన వైసీపీ నిర్ణయం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని మహేశ్ ఆరోపించారు. కులాల మధ్య చిచ్చుపెట్టే ఉద్దేశ్యంతో, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని ఉద్దేశపూర్వకంగానే వైసీపీ నాయకులు కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు. కేవలం రాజకీయ లబ్ది కోసమే వైసీపీ ప్రభుత్వం జిల్లాల పేరు అంశాన్ని తెర మీదకు తెచ్చిందని మహేశ్ ఆరోపించారు. ఇంత అల్లర్లు జరుగుతుంటే బాధ్యతగా స్పందించాల్సిన మంత్రులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని.. బొత్స సత్యనారాయణ జిల్లాల పేర్లు మార్చడం ఒక నిరంతర ప్రక్రియ అని చెప్పారని ఆయన ఎద్దేవా చేశారు.
పేర్లు మార్చడంతోపాటు కొత్త జిల్లాల ఏర్పాటు కూడా ఒక నిరంతర ప్రక్రియగా పెట్టుకోవాలని జనసేన పక్షాన మహేశ్ డిమాండ్ చేశారు. కడపకు వైఎస్ఆర్ కడప జిల్లా అని పేరు పెట్టారని... వైద్య వృత్తిలో ఉన్న వైఎస్ఆర్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారంటే అందుకు కారణం అంబేద్కర్ అని స్పష్టం చేశారు. ఆయన తీసుకున్న నిర్ణయాల వల్లే ఇవాళ కశ్మీర్ భారత భూభాగంలో ఉందని... అలాంటి గొప్ప వ్యక్తి పేరుని వివాదాల్లోకి లాగి రాజకీయంగా వాడుకుంటూ వైసీపీ ప్రభుత్వం దుర్మార్గమైన పనులు చేస్తోందని మహేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే - పులివెందుల కేంద్రంగా భీమ్ రావు జిల్లా ఏర్పాటు గురించి ముఖ్యమంత్రిని ఒప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. సీనియర్ మంత్రులైన ఆ ముగ్గురూ బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు. జనసేన పార్టీకి అమలాపురంలో జరిగిన అల్లర్లకు సంబంధం లేదని మహేశ్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న ప్రతి ఫోటోలో అల్లర్లకు కారణంగా చెబుతున్న వ్యక్తి వైసీపీలో ఉన్న మేధావి, ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో దిగిన ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయని ఆయన సెటైర్లు వేశారు. వైసీపీ నాయకులు ముందుగా దానికి సమాధానం చెప్పాలని మహేశ్ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలను మోసం చేసిన ఏకైక పార్టీ వైసీపీయేనని ఎద్దేవా చేశారు. కేవలం వారిని జెండాలు మోసే కూలీలుగా, ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే వాడుకుంటున్న మీకు సామాజిక భేరి పేరిట బస్సు యాత్ర చేపట్టే అర్హత లేదని మహేశ్ ధ్వజమెత్తారు. మీరు ఏం సాధించారని, ఏ వర్గాలకు మంచి చేశారని యాత్ర చేస్తారని ఆయన ప్రశ్నించారు. మీరు బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ మంత్రుల్ని తోలు బొమ్మల్ని చేసి ఆ వర్గాలను మోసగించేలా బస్సు యాత్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం బీసీ రిజర్వేషన్ రద్దు చేసి 18 వేల మంది బీసీలకు స్థానిక ఎన్నికల్లో పదవులకు దూరమైనందుకా ఈ బస్సు యాత్ర అని మహేశ్ నిలదీశారు.
ఎస్సీ ఎస్టీల మీదనే అట్రాసిటీ కేసులు పెట్టినందుకా... ముస్లింలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సబ్ ప్లాన్ రద్దు చేసినందుకా .. దుల్హన్ పథకం రద్దు చేసినందుకా, విదేశీ విద్యోన్నతి పథకం రద్దు చేసినందుకా, సబ్సిడీ రుణాలు రద్దు చేసి వెనుకబడిన వర్గాలను మోసం చేసినందుకా ఎందుకు ఈ బస్సు యాత్ర అని మహేశ్ నిలదీశారు. మీకు నిజంగా చిత్తశుద్ది ఉంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు గడచిన మూడేళ్లలో కేటాయించిన సబ్ ప్లాన్ నిధులు ఎంత? అందులో ఆ వర్గాల అభివృద్ధికి ఖర్చు చేసింది ఎంత శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వెనుకబడిన వర్గాలను మోసం చేసింది కాక బస్సు యాత్రకు బయలుదేరేందుకు మంత్రులకు సిగ్గుండాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం చేసిన మోసాన్ని ప్రజలంతా గ్రహించారని.. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని మహేశ్ జోస్యం చెప్పారు.