ప్రజల దృష్టి మరల్చేందుకే పవన్‌పై విమర్శలు.. టైం చూసి గట్టిగా ఇస్తాం : మంత్రులకు నాగబాబు వార్నింగ్
- IndiaGlitz, [Wednesday,April 27 2022]
శాంతి భద్రతలను పరిరక్షించడం కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న పోలీస్ వ్యవస్థను వై.సీ.పీ. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు జనసేన పీఏసీ సభ్యులు, సినీనటుడు పవన్ కల్యాణ్. తమ సేవలకు ప్రతిఫలంగా వచ్చే జీతభత్యాల మీద ఆధార పడే ఉద్యోగులను వేధించడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. రైతాంగం, ఉద్యోగులు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పలు అంశాలను గురించి ప్రస్తావిస్తూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పోలీస్ శాఖలోని ఉద్యోగులకు గత కొన్ని నెలలుగా జీత భత్యాలు సకాలంలో అందడం లేదని నాగబాబు అన్నారు. సగటు పోలీస్ ఉద్యోగి కుటుంబం సభ్యుడిగా సకాలంలో జీతభత్యాలు అందకపోతే చోటు చేసుకునే సమస్యలు తనకు తెలుసునని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్ధితులు అనుభవించాం కాబట్టే అటువంటి సమస్యలు మరొకరికి రాకూడదని ఉద్యోగస్తుల పక్షాన మాట్లాడుతున్నట్లు నాగబాబు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జనసేన పార్టీకి రాజ్యాధికారం అప్పజెప్పాలని, పవన్ కల్యాణ్‌ని ముఖ్యమంత్రిని చేయ్యాలనే భావన అన్ని వర్గాల ప్రజల నుంచి వ్యక్తమవుతోందన్నారు. జనసేన బలమైన నిర్మాణం కోసం తన చివరి శ్వాస వరకు జన సైనికుడిగా పని చేస్తానని నాగబాబు స్పష్టం చేశారు. జనసేన నిర్మాణం కోసం రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి రావడానికైనా సిద్ధంగా ఉన్నానని, జన సైనికులు, వీర మహిళలు ఆత్మ విశ్వాసం కోల్పోవద్దని, ఏ విధమైన బెదిరింపులకు, ప్రలోభాలకు లొంగొద్దని ఆయన సూచించారు. ఇక నుంచి ప్రతీ జన సైనికుడికి, వీర మహిళకు అందుబాటులో ఉంటానని నాగబాబు భరోసా ఇచ్చారు.
ప్రజా సమస్యలు, రైతాంగం కష్టాల గురించి తాము మాట్లాడుతుంటే వ్యక్తిగత జీవితాల గురించి ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమవుతున్న తీరును, ప్రజా ప్రయోజన వ్యవహారాల్లో వై.సీ.పీ. ప్రభుత్వం అసమర్థతను కప్పిపుచ్చడానికే మంత్రులు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని నాగబాబు ఫైరయ్యారు. వై.సీ.పీ. ప్రభుత్వం అవినీతి, అరాచకాల వైపు ప్రజలు దృష్టి పెడితే తమ బండారం బయట పడుతుందని ప్రజల దృష్టి మరల్చేందుకే ఇలా చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
సీఎం, ఆయన అనుచర మంత్రి గణం చేస్తున్న ప్రయత్నాలకు సరైన సమయంలో సమాధానం చెప్తామని నాగబాబు హెచ్చరించారు. ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ... పరిపాలనలో లోటుపాట్లను పట్టించుకోకుండా కేవలం పవన్ కల్యాణ్ మీద పడి మొరుగుతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని నాగబాబు ధ్వజమెత్తారు. పవన్ జీవితం తెరిచిన పుస్తకమని అందరికీ తెలిసిందే.. ప్రజా జీవితం కోసం, ప్రజా చైతన్యం కోసం, ప్రజలతో మమేకమై పని చేస్తున్న పవన్ గురించి మాట్లాడటం వైసీపీ అహంకారానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత జీవితంపై దాడి చేస్తే భయపడి పోతారు, అప్పుడు మనల్ని ప్రశ్నించేవారు, ఎదురించే వారే ఉండరు అనుకుంటున్నారని నాగబాబు ఎద్దేవా చేశారు.