కరెంటు కోతలే ఉండవన్నారు.. జగన్ "కోతలు" ఏమయ్యాయి, పవన్ రావాల్సిందే: నాగబాబు
- IndiaGlitz, [Tuesday,May 03 2022]
రాష్ట్రంలో కరెంటు కోతల వల్ల ప్రజలు అవస్థలకు గురవుతున్నారని జనసేన నేత, సినీనటుడు నాగబాబు అన్నారు. వేసవిలో విద్యుత్ కొరతను నివారించేందుకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాదుడే .. బాదుడంటూ గతంలో వ్యంగ్యంగా విమర్శనాస్త్రాలు సంధించిన సీఎం జగన్ ఇప్పుడు విద్యుత్తు సంక్షోభం అధిగమించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో ప్రజలకు వివరించాలని నాగబాబు కోరారు. కరెంటు కోతలే ఉండవన్నసీఎం జగన్ కోతలు ఏమయ్యాయంటూ సెటైర్లు వేశారు.
విద్యుత్ కొరత కారణంగా పరిశ్రమలు మూసేస్తే.. కార్మిక కుటుంబాల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఉత్పాదకత కొరత కారణం చూపి గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా సహకార రంగంలోని ఆరు చక్కెర కర్మాగారాలు మూసివేశారని నాగబాబు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో గత ప్రభుత్వాలు సౌర విద్యుత్, పవర్ గ్రిడ్, విద్యుత్ కాంట్రాక్ట్ అని రకరకాల ప్రయోగాలతో వేల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశాయని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో సమృద్దిగా నీటి వనరులు ఉన్నప్పటికీ.. విద్యుత్తు ఉత్పాదక ప్రయత్నాలు చేయలేకపోవడం ప్రస్తుత, గత పాలకుల అసమర్థతకు నిదర్శనమని నాగబాబు ఎద్దేవా చేశారు. విద్యుత్ సంక్షోభం అధిగమించేందుకు జనసేన పార్టీకి ఓ ప్రణాళిక ఉందని ఆయన గుర్తుచేశారు.
వారానికి ఒకరోజు, రెండు రోజులు, మరొక్క రోజు అంటూ పరిశ్రమలను పనిచేయకుండా మూసేస్తే కార్మికుల కుటుంబాలను పరిస్ధితిని ఏమటని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ఉత్పత్తి మార్గాలపై ఎలాగూ దృష్టి పెట్టే విధానాలు కనిపించట్లేదని... ఉన్న ఉపాధిని కూడా అడ్డుకుంటే రాష్ట్ర భవిష్యత్తు ఏమవ్వాలని నాగబాబు నిలదీశారు. రాష్ట్రంలో గంటల తరబడి కరెంట్ కోతల వలన ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కరెంట్ వచ్చినప్పుడు వాడుకుంటుంటే.. అడ్డూ అదుపులేని ఛార్జీలతో దోచుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
వేసవిలోనూ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందజేసేందుకు వైసీపీ ప్రభుత్వం తీసుకున్న చొరవ ఏమిటో ప్రజలకు వివరించాలని నాగబాబు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వున్న పరిస్ధితులు దృష్ట్యా ప్రజలకు ఇప్పుడు పవన్ కల్యాణ్ అవసరం వుందని ఆయన వ్యాఖ్యానించారు. ఏ విషయంలోనైనా పూర్తి స్పష్టత వున్నప్పుడే పవన్ కల్యాన్ ఆయా అంశాలపై మాట్లాడతారని.. వాటిపై పరిష్కారాలను కూడా చూపగలరని నాగబాబు అన్నారు.