Janasena Party: ప్రతీ పైసా దారి మళ్లింపే.. జనం ఆదమరిస్తే, ఏపీ అంధకారమే: జగన్‌పై నాగబాబు విమర్శలు
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లోంచి దాదాపు రూ.800 కోట్ల నగదు మాయమైన ఘటన రాష్ట్రంలో రాజకీయ దుమారానికి కారణమైంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, సినీనటుడు నాగబాబు స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో నుంచి సొమ్ములను తీసేసుకోవడాన్ని సాంకేతిక లోపం అని చెబుతున్న వైసీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 12,918 గ్రామ పంచాయితీల ఖాతాల్లోని నిధులను ఊడ్చేయడాన్ని ఏమంటారని నాగబాబు ప్రశ్నించారు.
ప్రతీ పైసా దారి మళ్లింపే:
గురువారం జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, శ్రేణులతో నాగబాబు గారు వివిధ అంశాలపై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ .. ఆంధ్రప్రదేశ్ ప్రజలపై రూ.8 లక్షల కోట్ల రుణ భారాన్ని ఈ ప్రభుత్వం మోపిందని దుయ్యబట్టారు. సర్పంచుల ఖాతాల్లో చిల్లి గవ్వ లేకుండా తీసేసుకొందని.. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల కష్టార్జితం కుడా దోచుకునేందుకు తెగించడం ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణారాహిత్యానికి పరాకాష్ట అన్నారు. ఒక్క రూపాయి ఉత్పాదన గురించి ఆలోచించకుండా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ప్రభుత్వ ఆస్తులను, స్థలాలను అమ్ముకోవడం, అడ్డూ అదుపూ లేకుండా పన్నులు వసూలు చేయడం, ప్రభుత్వ ఖజానాలో ప్రతీ పైసాను దారి మళ్లించడం ‘జగన్ రెడ్డి మార్కు పాలన’గా ప్రజలకు అర్థం అవుతోందని నాగబాబు ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలు ఆదమరిస్తే ఆంధ్రప్రదేశ్‌ను అంధకారం చేసే పరిస్థితి కనబడుతోందని ఆయన జోస్యం చెప్పారు.
వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిందే:
గ్రామాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం జమ చేసిన 15వ ప్రణాళిక సంఘం నిధులను మళ్లించుకోవడంపై ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నెలవారీ ఆదాయంలో కొంత సొమ్మును భవిష్యత్తు అవసరాలు, పిల్లల చదువులు, గృహ నిర్మాణం, వైద్య ఖర్చులు, తదితర అవసరాల నిమిత్తం జీ.పీ.ఎఫ్. నిధిగా ఉద్యోగులు పొదుపు చేసుకుంటారని నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల కష్టార్జితం రూ.800 కోట్లు మళ్లించేసిన వైసీపీని సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందని నాగబాబు వ్యాఖ్యానించారు. రాజకీయాలకు అతీతంగా పౌర సమాజం బాధిత ఉద్యోగుల పక్షాన నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. సగటు ప్రభుత్వ ఉద్యోగిపై ఆధారపడి ఉండే కుటుంబ సభ్యుల అవసరాలు ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా తనకు తెలుసునని నాగబాబు తెలిపారు.
టీటీడీ రిఫండబుల్ డిపాజిట్ కూడానా:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తలమానికమైన తిరుమల తిరుపతి దేవస్థానంకు వచ్చే భక్తుల వద్ద నుంచి వసతి గృహాల అద్దె కోసం వసూలు చేస్తున్న "రిఫండబుల్ డిపాజిట్"లో అద్దె జమ చేసుకోగా మిగిలిన సొమ్ము తిరిగి వారికి చెల్లించట్లేదని నాగబాబు ఆరోపించారు. అదేంటి అని ప్రశ్నిస్తే మీ బ్యాంక్ ఖాతాకు పంపుతామని చెప్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని నాగబాబు పేర్కొన్నారు. దేవుడిపై భక్తి శ్రద్ధలతో వచ్చే భక్తులు "రిఫండబుల్ డిపాజిట్" లో అద్దెపోగా తమకు రావాల్సిన సొమ్ము ఒకటి, రెండు సార్లు అడిగినా ప్రయోజనం లేకుండా పోతోందని ఆయన వాపోయారు. ఈ సొమ్ములు ఏం చేస్తున్నారో టీటీడీ ఉన్నతాధికారులు సమాధానం చెప్పాలని నాగబాబు డిమాండ్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments