మహిళలపై అత్యాచారాలు.. వినతి పత్రం ఇద్దామని వస్తే.. అరెస్ట్ చేయిస్తారా : ఏపీ సర్కార్‌పై జనసేన ఆగ్రహం
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్‌లో వరుస అత్యాచార ఘటనలపై జనసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆడబిడ్డలు భయం భయంగా రోడ్డు మీదకు రావాల్సిన పరిస్థితులు వచ్చాయంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా దిగజారాయో అర్థం అవుతోందని ఆయన దుయ్యబట్టారు. ఈ విషయం మీద బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా జనసేన నిరసన తెలుపుతుంటే పోలీసులతో కట్టడి చేయాలని చూస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని బట్టి రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాన్ని ఒప్పుకొన్నట్లేనని ఆయన విమర్శించారు.
రేపల్లెలో సామూహిక అత్యాచారానికి గురై ఒంగోలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆమె కుటుంబానికి ధైర్యం చెప్పి, అక్కడికి వచ్చిన హోంమంత్రిని మంత్రిని కలిసి వినతి పత్రం ఇవ్వాలనుకున్న జనసేన నాయకులను నిర్బంధంలోకి తీసుకోవడం అప్రజాస్వామికమని నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదపూడి విజయ్ కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి డా.పాకనాటి గౌతమ్ రాజ్, ఒంగోలు పట్టణ అధ్యక్షులు మలగా రమేష్, వీరమహిళ ప్రాంతీయ సమన్వయకర్త బొందిల శ్రీదేవి, పార్టీ నేతలు రాయని రమేష్, పల్లా ప్రమీల, గోవిందు కోమలి, ఆకుపాటి ఉషలను పోలీసులు నిర్బంధించారని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలపై ఈ విధంగా నిర్భందాలు, కేసులు పెట్టడంపై దృష్టిపెట్టడం కాకుండా మహిళల రక్షణకై కఠినంగా వ్యవహరించాలని నాదెండ్ల హితవు పలికారు.
అంతకుముందు ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతున్న రేపల్లె అత్యాచార బాధితురాలిని ఏపీ హోంమంత్రి తానేటి వనిత పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. భర్తను నిద్రలేపిన నిందితులు.. టైం అడిగి కొట్టారని, అతనిపై దాడిని అడ్డుకోబోయిన భార్యపై అత్యాచారానికి ఒడిగట్టారని తెలిపారు. రైల్వేస్టేషన్ దగ్గరలో ఉన్న నేతాజీ కాలనీకి చెందిన నిందితులను గంటల వ్యవధిలోనే పట్టుకుని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. బాధితురాలికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించామని... నిందితులపై అట్రాసిటీ, దోపిడి, హత్యాయత్నం కేసులు నమోదు చేశామని తానేటి వనిత చెప్పారు. గోప్యత కోసమే పరామర్శకు పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతి ఇస్తున్నామని, పరామర్శ పేరుతో అలజడి చేస్తామంటే కుదరదని ప్రతిపక్షనేతలను హోంమంత్రి హెచ్చరించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout