janasena : పవన్‌కు భయపడుతున్నారు.. అందుకే ఈ కుయుక్తులు: జనసేన నేత తాతారావు
Send us your feedback to audioarticles@vaarta.com
తాము చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్రకు వస్తున్న స్పందన చూసి తట్టుకోలేక తాజా, మాజీ మంత్రులతో ప్రభుత్వం విమర్శలు చేయిస్తుందని మండిపడ్డారు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కోన తాతారావు . విశాఖపట్నం ప్రెస్ క్లబ్‌లో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పన్నినా పవన్ కళ్యాణ్ ప్రభంజనాన్ని అడ్డుకోలేదన్నారు. అధికారం చేతిలో ఉన్నా ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలస్‌కే పరిమితమైతే... ఏ అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నారని తాతారావు పేర్కొన్నారు.
పవన్ పాపులారిటీ చూసి ప్రభుత్వం భయపడుతుంది:
పవన్ కళ్యాణ్‌కి పెరుగుతున్న జనాదరణ చూసి తాజా మంత్రులు జోగి రమేష్ , అంబటి రాంబాబుతో పాటు మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు రైతులను గుర్తించి, వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తున్న పవన్ కళ్యాణ్‌ను చూసి ప్రభుత్వం భయపడుతోందని తాతారావు దుయ్యబట్టారు. ప్రభుత్వం చేయాల్సిన పని పవన్ కళ్యాణ్ ఒక్కరే చేయడంతో వైసీపీ నాయకులు అభద్రత భావానికి గురవుతున్నారని మండిపడ్డారు.
లీటరుకు టీఎంసీలకు తేడా తెలియని వాళ్లు మాట్లాడుతున్నారు:
లీటరుకు టీఎంసీలకు తేడా తెలియని అంబటి కూడా పవన్ కళ్యాణ్‌ను విమర్శించడం హాస్యాస్పదమన్నారు. మంత్రి పదవి ఊడిపోయినా ఇంకా మంత్రినే అనే భ్రమలో పేర్ని నాని ఉన్నారంటూ తాతారావు సెటైర్లు వేశారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలనే ఉత్సాహంతో పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేస్తున్నారని తాతారావు ఫైరయ్యారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు జనసేన ఎవరితో ముందుకు వెళ్తుంది? ఒంటరిగా వెళ్తుందా? పొత్తులు పెట్టుకుంటుందా? అనేది మా అధినేత చూసుకుంటారని ఆయన స్పష్టం చేశారు. దానిపై వైసీపీ నాయకులు మదనపడాల్సిన అవసరం లేదన్నారు.
మీరు అనుకునే స్థిరత్వం మాకు చేతకాదు:
పవన్ కళ్యాణ్‌కి స్థిరత్వం లేదని కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని... 151 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే ప్రజలకు ఇసుక దొరక్కుండా చేయడమే స్థిరత్వమా అని తాతారావు ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని యువతను మోసగించడం స్థిరత్వమా అని ఆయన నిలదీశారు. మద్యపాన నిషేధమని చెప్పి... దానిపై వచ్చిన ఆదాయాన్నే గ్యారెంటీలుగా చూపించి అప్పులు తెచ్చుకోవడం స్థిరత్వమా అని తాతారావు మండిపడ్డారు. సంక్షేమం పేరుతో లక్షల కోట్లు అప్పులు తెచ్చి జేబులు నింపుకోవడం స్థిరత్వమా? తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని కోట్లు దోచేయడం స్థిరత్వమా అని ఆయన ప్రశ్నించారు. ఇవే వైసీపీ దృష్టిలో స్థిరత్వం అయితే తమ అధినేతకు ఎన్నటికీ చేతకావని తాతారావు చురకలు వేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com