Janasena : ఆయన దాడిశెట్టి రాజా కాదు.. బోడిశెట్టి రాజా, మీకు ఇవ్వాల్సింది పెగ్గు.. పేకాట శాఖ: కిరణ్ రాయల్
- IndiaGlitz, [Monday,July 18 2022]
రాష్ట్రంలోని రోడ్ల పరిస్ధితి, పవన్ కల్యాణ్‌పై మంత్రి దాడిశెట్టి రాజా వ్యాఖ్యలపై స్పందించారు జనసేన తిరుపతి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కిరణ్ రాయల్. తిరుపతి ప్రెస్ క్లబ్ లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో గుంతల్లో రోడ్లు వెతుక్కోవలసిన పరిస్థితి ఉందంటూ సెటైర్లు వేశారు. అలాంటప్పుడు వాహనాలు కొనే సమయంలో ప్రజలు ప్రభుత్వానికి రోడ్డు టాక్స్ ఎందుకు కట్టాలని కిరణ్ రాయల్ నిలదీశారు. జనసేన పార్టీ పిలుపునిచ్చిన గుడ్ మార్నింగ్ సీఎం సార్ కార్యక్రమం విజయవంతమైందని... పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని ఆయన ప్రశంసించారు.
తిరుపతిలోనూ మూడు రోజుల పాటు డిజిటల్ క్యాంపెయిన్:
తిరుపతి నగరంలోనూ మూడు రోజులపాటు డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించామని కిరణ్ రాయల్ తెలిపారు. దీనిలో భాగంగా మొదటి రోజు రోడ్ల పరిస్థితిని తెలియజేస్తే, రెండో రోజు రాష్ట్ర ప్రభుత్వ తీరు మీద పోలీసులకు ఫిర్యాదు చేశామని, మూడవరోజు ఈ రోడ్లపై వాహనాలు నడపలేమని వాటిని పక్కన పెట్టే కార్యక్రమం చేశామన్నారు. రాష్ట్రంలో ఉన్న అత్యంత దారుణమైన రోడ్ల మీద ప్రయాణించే పరిస్థితి లేదని కిరణ్ ఎద్దేవా చేశారు. ప్రతి ఒక్కరూ తమ వాహనాలను కొనుగోలు చేసే సమయంలో రోడ్డు టాక్స్ కింద వాహనం యొక్క విలువ ఆధారంగా ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తున్నారని... దీనిని రోడ్లపై తిరగడానికి రోడ్ల నిర్వహణ ఖర్చు కింద ప్రభుత్వం ఇది ఉపయోగించాలని ఆయన గుర్తుచేశారు.
ప్రభుత్వంపై కేసులు పెట్టండి:
అయితే రాష్ట్రంలో రోడ్లే లేనప్పుడు పన్ను ఎందుకు కట్టాలి..? ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కిరణ్ పిలుపునిచ్చారు. దీనిపై దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్లి ప్రతి ఒక్కరు ఫిర్యాదు చేయాలని.. మన డబ్బులు మనకు తిరిగి ఇప్పించాలని కోరాలని ఆయన స్పష్టం చేశారు . వాహనం ఉన్న ప్రతి ఒక్కరూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం మర్చిపోవద్దని... తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో దీనిపై ఫిర్యాదు చేశామని కిరణ్ రాయల్ గుర్తుచేశారు. ఇప్పటివరకు తీసుకున్న ఫిర్యాదుకు ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వలేదని, రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా స్పందిస్తే గాని ఈ ప్రభుత్వానికి బుద్ధి రాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
దాడిశెట్టి రాజాకు పీ అండ్ ఎం శాఖ ఇవ్వాలి:
ఇక మంత్రి డాడిశెట్టి రాజా వ్యాఖ్యలపై స్పందిస్తూ... జనసేన కార్యక్రమాలను ప్రశంసించాల్సిందిపోయి, పవన్ కళ్యాణ్ మీద నోరు పారేసుకోవడం మానుకోవాలని కిరణ్ రాయల్ హెచ్చరించారు. మీరు ఇష్టానుసారం మాట్లాడితే దానికి రెండు రెట్లు ఇంకా దారుణంగా మాట్లాడగల సత్తా మాకు ఉందని ఆయన స్పష్టం చేశారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజాను ఇక మీదట బోడిశెట్టి రాజా అనే పిలుస్తామని.. మంత్రిగా ముందు రోడ్ల మీద దృష్టి పెట్టాలని కిరణ్ రాయల్ హితవు పలికారు. ఇతర కార్యకలాపాల మీద ఉన్న దృష్టి రోడ్ల మీద పెడితే మీకు క్షేత్రస్థాయి పరిస్థితి అర్థం అవుతుందని ఆయన దుయ్యబట్టారు. రాజాకు ఆర్ అండ్ బి శాఖ కాకుండా... పీ అండ్ ఎం మంత్రి పదవి ఇవ్వాలిని, పీ అంటే పెగ్గు.. పేకాట, ఎం అంటే మందు.. ముక్క మంత్రిగా కరెక్ట్ గా సరిపోతారని కిరణ్ సెటైర్లు వేశారు.
దాడిశెట్టి రాజా అక్రమాలపై విచారణ చేయిస్తాం:
మిమ్మల్ని కాపు కోటాలో మంత్రిని చేశారని మీరు భావిస్తున్నారని.. కానీ వైసీపీ అధినాయకత్వం మాత్రం మీ గంజాయి బాగోతాలు, దొంగ బంగారం వ్యాపారం తతంగం చూసే మీకు మంత్రి పదవి ఇచ్చిందని ఆయన ఆరోపించారు. ఆ పార్టీకి అలాంటి వారే చాలా ఇష్టం కనుక మీకు మంత్రి పదవి వరించిందని.. మీరు ఏ విధంగా బంగారం అక్రమ రవాణా చేస్తున్నారు.. ఎలా కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారో మాకు తెలుసునంటూ కిరణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి రవాణా మీ కనుసన్నల్లో ఎలా జరుగుతుందో మా దగ్గర సమాచారం ఉందని.. ఓ విలేకరి హత్యలో మీ పాత్ర ఉందన్న ఆరోపణలపై ఏం చెబుతారని ఆయన ప్రశ్నించారు. మా ప్రభుత్వం రాగానే మీ మీద తప్పనిసరిగా విచారణ చేయిస్తాం.. జైల్లో కూర్చోబెడతాం జాగ్రత్త అని కిరణ్ రాయల్ హెచ్చరించారు.