జనసేన కావలి అభ్యర్థి ఫిక్స్...
- IndiaGlitz, [Tuesday,March 05 2019]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‘ప్రజా పోరాట యాత్ర’లో భాగంగా పలువురు అభ్యర్థులను పరోక్షంగా ప్రకటించేస్తూ వస్తున్నారు. ఫలానా వ్యక్తిని ఆదరించండి.. చట్టసభలకు పంపుదాం అంటూ.. పరోక్షంగా చెబుతూ ముందుకెళ్తున్నారు. ఇప్పటికే రాయలసీమలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన తాజాగా నెల్లూరు జిల్లా పర్యటనను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గంలో పర్యటించిన పవన్.. సుధాకర్ అనే వ్యక్తిని నియోజకవర్గ ప్రజలకు పరిచయం చేశారు. పదే పదే ఆయన పేరు పలకడంతో అభ్యర్థి ఈయనేనని జనసైనికులు, అటు అభిమానులు దాదాపు ఫిక్స్ అయిపోయారట.
నెల్లూరు సభలో పవన్ ఏం మాట్లాడారు..!?
ఇంతవరకు కుటుంబ రాజకీయ నాయకుల పల్లకీలు మోసింది చాలు. ఇకపై బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన, నీతినిజాయతీగల వ్యక్తుల్ని పల్లకీలు ఎక్కించి మోద్దాం. అన్ని కులాలకు సంబంధించిన, ఉన్నత విలువలు ఉన్న వ్యక్తుల్ని చట్ట సభలకు పంపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం. సుధాకర్ లాంటి వ్యక్తుల్ని చట్టసభలకి పంపుదాం. రూ. 45 రూపాయిల రోజు కూలితో జీవితం ప్రారంభించిన వ్యక్తి సుధాకర్. స్కూలు పిల్లలకి సౌకర్యాలు కల్పిచేందుకు తన సంపాదన నుంచి లక్షలు ఖర్చుపెట్టేందుకు వెనుకాడని వ్యక్తి. పట్టుదలతో పైకి వచ్చిన వ్యక్తి. ఆయన నన్ను కలిసినప్పుడు బయోడేటా ఇవ్వండి స్క్రీనింగ్ కమిటీ మీ అభ్యర్ధిత్వం పరిశీలిస్తుందని చెప్పాను. జనరల్ బాడీ ఆయన అభ్యర్ధిత్వాన్ని పరిశీలిస్తుంది. కావాలంటే ఉన్న రాజకీయ కుటుంబాల్లో ఏదో ఒక కుటుంబం నుంచి అభ్యర్ధిని ఎంచుకోవచ్చు.. కానీ మార్పు రావాలంటే ప్రజల కష్టం తెలిసిన సామాన్యులు రాజకీయాల్లోకి రావాలి. సుధాకర్ వడ్డెర కులానికి చెందిన వ్యక్తి. వడ్డెర్ల కష్టం నాకు తెలుసు. రాళ్లు కొట్టి కొట్టి అందరికీ ఇల్లు నిర్మిస్తారు. కానీ వాళ్లకు మాత్రం ఉండదు. బీసీలకు అండగా జనసేన ఉంటుంది అని పవన్ చెప్పుకొచ్చారు.
సో.. సుధాకర్ గురించి ఈ రేంజ్‌లో పవన్ చెబుతున్నారంటే ఆయనే కావలి అభ్యర్థి అని ఫిక్స్ చేసుకోవచ్చు. కావలి నియోజకవర్గంలో రాజకీయం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. నువ్వా నేనా అన్నట్లుగా వ్యవహారం ఉంటుంది. ఇక్కడ అధికార పార్టీ కంటే వైసీపీనే పైచేయిగా ఉంది. ఇలాంటి తరుణంలో జనసేన ఏ మాత్రం ఓట్లు సంపాదించుకుంటుందో వేచి చూడాల్సిందే మరి.