జనసేన కీలక ప్రకటన.. ఎల్లుండి ఏం జరగబోతోంది!?

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వైసీపీ కార్యకర్తలు, నేతల దాడిలో గాయపడిన కార్యకర్తలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ సర్కార్‌, పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ మాట్లాడిన అనంతరం ఆ పార్టీకి చెందిన నేత నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. జనవరి 16న కనుమ రోజు విజయవాడలో బీజేపీ-జనసేన మధ్య ముఖ్యమైన సమావేశం జరనుందని ఆయన ప్రకటించారు. విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ సమావేశం అనంతరం రెండు పార్టీలు చర్చించిన కీలక విషయాలను జనసేన-బీజేపీ నేతలు కలిసి మీడియా మీట్ నిర్వహిస్తామన్నారు. అయితే రాజధానిపై రగడ, కార్యకర్తలపై దాడులు.. ఢిల్లీ పర్యటన అనంతరం ఈ భేటీ జరుగుతుండటంతో ప్రాధాన్యత సంతరించుకోవడంతో పాటు.. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా అయ్యింది.

ఢిల్లీ పర్యటనలో ఏం జరిగింది!?

ఇదిలా ఉంటే.. ఇటీవలే మంగళగిరిలో పార్టీ నేతలతో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసిన పవన్.. టీడీపీ, బీజేపీలతో విడిపోయి తప్పుచేశాననని అందుకే వైసీపీ గెలిచిందని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి సుముఖంగానే ఉన్నట్లు పరోక్షంగా పవన్ ప్రకటించగా.. ఢిల్లీ కమలనాథులు కబురు పంపడం.. మీటింగ్‌లో ఉండగానే హుటాహుటిన పవన్ ఢిల్లీ పయనమయ్యారు. ఈ క్రమంలో రెండ్రోజులగా ఢిల్లీలోనే పవన్ మకాం వేసి.. మొదట ఆర్ఎస్ఎస్‌కు చెందిన కీలక నేతలతో సమావేశం కావడం, ఆ తర్వాత బీజేపీ కీలక నేత, వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను కలవడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ విలీనంతో పాటు పలు విషయాలపై నిశితంగా చర్చించగా.. విలీనం కుదరదని పొత్తు మాత్రమేనని పవన్ తేల్చిచెప్పారట.

ఎల్లుండి ఏం జరగబోతోంది!

కాగా.. ఇక బీజేపీతో కలిసి ముందుకు నడవాలని ఫిక్స్ అయిన పవన్ ఎల్లుండి.. రాష్ట్రానికి చెందిన కమలనాథులతో సమావేశం కాబోతున్నారు. అయితే ఎల్లుండి ఏం చర్చిస్తారు..? ఏయే విషయాలు చర్చకు రాబోతున్నాయ్..? ఇంతకీ ఢిల్లీ కమలనాథులు కలిసి నడవడానికి ఒప్పుకున్నారు సరే.. రాష్ట్ర బీజేపీ నేతల మనసులో ఏముంది..? పవన్‌తో కలిసి నడుస్తారా..? లేకుంటే పార్టీకే గుడ్ బై చెప్పేస్తారా..? అనేది ఎల్లుండి తేలిపోనుంది. అయితే ఎల్లుండి జరగనున్న ఈ భేటీపై ఇటు పవన్ వీరాభిమానులు, కార్యకర్తలు, బీజేపీ నేతలు-కార్యకర్తలు వేచి చూస్తున్నారు.