జనసేనకు 70 సీట్లు వచ్చేవి కానీ... పవన్
- IndiaGlitz, [Tuesday,November 05 2019]
‘జనసేన సమావేశాలకు వచ్చిన యువతలో 70 శాతం మంది పార్టీకి ఓట్లు వేసినా 70 సీట్లు వచ్చేవి. జనసేనకు అండగా నిలబడని యువత కోసం నేను ఇప్పటికీ పోరాడుతున్నాను. వారి బాధలను తెలుసుకుంటున్నాను’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు విశాఖపట్నంలోని ఓ హోటల్ లో జిల్లా జనసేన కార్యకర్తలతో పవన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఘోర ఓటమితోనే..!
ఆంధ్రప్రదేశ్‌లో 151 మంది ఎమ్మెల్యేలున్న వైసీపీ... ఒక్క ఎమ్మెల్యే ఉన్న తమ పార్టీపై విమర్శలు చేస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. దీన్ని బట్టే తమకు రాష్ట్రంలో ఎంతగా బలం ఉందో తెలుస్తోందని అన్నారు. తమ పోరాటంపై ఎంతగా ప్రతి స్పందన వస్తుందో తెలుసుకోవచ్చని అన్నారు. ఈ రోజు విశాఖపట్నంలో పర్యటిస్తోన్న ఆయన ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. దెబ్బతిన్నా తిరిగి లేచి నిలబడతానని.. ఘోర ఓటమి తర్వాత కూడా ప్రజల్లోకి వస్తున్నానన్నారు. అంతిమ లక్ష్యం కోసం అడుగులు వేసుకుంటూ వెళ్తానని మా సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నందుకే ధైర్యంగా అడుగులు వేశానని పవన్ తెలిపారు. ఆశయాల కోసం బలంగా నిలబడతానని.. కష్టాలు ఉన్నప్పుడు వెనకడుగు వేయనని పవన్ తెలిపారు.
అంటే సమావేశాలకు వస్తున్న వాళ్లు ఓట్లు వేయలేదని వాళ్లను అనుమానిస్తున్నారా..? లేకుంటే ఇకనైనా జనసేనకు ఓట్లేయండని అడుగుతున్నారా..? అసలు పవన్ ఏమంటున్నారో..? మెగాభిమానులు, జనసేన కార్యకర్తలపైనే పవన్‌కు నమ్మకం లేదా..? అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. అసలు ఓట్లు అడగాల్సిన.. అడిగి వేయించుకోవాల్సిన పద్ధతి ఇదేనా అంటూ సోషల్ మీడియా వేదికగా పవన్‌పై తీవ్ర స్థాయిలో నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
విమర్శించకూడదా!?
ఇక విమర్శల విషయానికొస్తే.. ప్రతిపక్షాలు, అధికారపార్టీపై.. అధికార పార్టీపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించుకోవడం.. కౌంటర్లిచ్చుకోవడం షరామామూలే. అంత మాత్రాన విమర్శించకూడదనే నిబంధన అస్సలు ఎక్కడా లేదు. ప్రభుత్వ కార్యక్రమాలను.. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపై ఎంతైనా ఉంది. అంతేకాదు.. ప్రతిపక్షాలు రాద్ధాంతాలు చేస్తే అధికార పార్టీ కూడా విమర్శించే పరిస్థితులు కూడా ఉంటాయ్. అంత మాత్రన ఏదోదే ఊహించుకోవడం.. ఏదేదో అనుకోవడం పరిపాటేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.