Nagababu:మీ ప్రోత్సాహం మరువలేనిది.. ఇదే స్పూర్తితో జనసేన ప్రభుత్వాన్ని స్థాపిద్దాం : ఎన్ఆర్ఐలతో నాగబాబు
- IndiaGlitz, [Monday,May 29 2023]
జనసేన పార్టీ బలోపేతం కోసం విదేశాల్లో స్థిరపడిన భారతీయులు, ముఖ్యంగా ప్రవాసాంధ్రులు అందిస్తున్న సహకారం ఎన్నటికీ మరువలేనిదన్నారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు. ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల్లో మూడు రోజుల పాటు పర్యటించిన ఆయన ప్రవాస భారతీయులు, జనసైనికులను కలిశారు. ఈ సందర్భంగా అక్కడ తనకు లభించిన ఆతిథ్యంపై నాగబాబు ప్రకటన విడుదల చేశారు. భవిష్యత్తు తరాల కోసం కలిసి కట్టుగా పనిచేస్తూ.. పవన్ కల్యాన్ స్పూర్తిని కొనసాగిద్దామని ఆయన స్పష్టం చేశారు. అజ్మాన్ నగరంలో దుబాయ్ - యూఏఈ జనసేన పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం, అది తన చేతుల మీదుగా ప్రారంభించడం అంతులేని అనుభూతినిచ్చిందని నాగబాబు పేర్కొన్నారు.
దుబాయ్‌లో మొక్క నాటడం జీవితాంతం గుర్తుంటుంది :
గల్ఫ్ దేశాల కార్యకర్తల కోసం కార్యాలయం నిర్మించిన కేసరి త్రిమూర్తులను నాగబాబు అభినందించారు. సౌదీ అరేబియా, కువైట్, ఒమన్, ఖతార్, బహ్రెయిన్, యూఏఈ దేశాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కార్యాలయం నిర్వహించబడటం అనేది అందరికీ ఉపయోగకరమన్నారు. గల్ఫ్ దేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయుల కోసం జనసేన హెల్ప్‌లైన్ కూడా ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. వీర మహిళల సమావేశంలో సామాజిక ఉద్యమకారిణి, దూబగుంట సారా నిషేధ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన టీ.మణి చలపతి ప్రసంగం స్ఫూర్తినిచ్చిందని నాగబాబు చెప్పారు. దుబాయిలో మొక్క నాటిన అనుభవం తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు.
మీ సేవలు వెల కట్టలేనివి :
సొంత అక్క చెల్లెళ్లలా వీర మహిళలు చూపించిన అభిమానం గొప్పదన్నారు. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న రోజుల్లో ప్రవాస భారతీయులు వారి స్వస్థలానికి రాలేని పరిస్థితుల్లో గల్ఫ్ దేశాల్లో ఉన్న జన సైనికులు, వీర మహిళలు ప్రత్యేకంగా విమానాలు ఏర్పాటు చేసి వారిని తరలించారని నాగబాబు గుర్తుచేశారు. తెలుగు రాష్ట్రాల్లో లెక్కబెట్టలేనన్ని సామాజిక సేవ కార్యక్రమాలకు చేయూతనిచ్చిన సందర్భాలు ఎంతో విలువైనవిగా ఆయన కొనియాడారు. జనసేన ప్రభుత్వంలో ప్రజా ప్రయోజన పాలన కోసం ప్రవాస భారతీయుల సలహాలు, సూచనలు, అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తూ పాలనలో భాగస్వామ్యం చేస్తామని నాగబాబు స్పష్టం చేశారు. సమాజ శ్రేయస్సు కోసం పని చేస్తున్న ప్రతీ ప్రవాస జన సైనికులు, వీర మహిళలకు ఆయన అభినందనలు తెలియజేశారు. ప్రవాస భారతీయులు గతంలో అనేక సందర్భాల్లో తెలుగు రాష్ట్రాల్లో విభిన్నమైన సామాజిక సేవ కార్యక్రమాలకు చేయూతనిచ్చిన సందర్భాలు ఎంతో విలువైనవన్నారు. పవన్ కళ్యాణ్ భావజాలం , వ్యక్తిత్వం స్ఫూర్తిగా మున్ముందు ఇదే ఉత్సాహం, పట్టుదలతో పార్టీని బలోపేతం చేసుకుంటూ జనసేన ప్రభుత్వాన్ని స్థాపించి ప్రజా ప్రయోజన పాలన అందిద్దామని నాగబాబు పిలుపునిచ్చారు.