అవినీతిలేని రాజకీయ వ్యవస్థ కోసం జనసేనను గెలిపించండి
Send us your feedback to audioarticles@vaarta.com
ఆదోని నియోజకవర్గం పరిధిలో రాష్ట్రంలో ఎక్కడా కనబడని ఓ చిత్రమైన రాజకీయ పరిస్థితులు కనబడతాయని, రాజకీయ ప్రత్యర్ధులు కేవలం రాజకీయాలకి మాత్రమే ప్రత్యర్ధులని, ప్రజల్ని దోచుకునే వ్యవహారంలో మాత్రం ఇద్దరూ ఒక్కటేనని జనసేన అధినేత పవన్ పేర్కొన్నారు. దోపిడిలో 60:40 పర్సంటేజ్ లెక్కన రెండు పార్టీల నాయకులు పంచుకుంటున్నారని, కాంట్రాక్టుల దగ్గర నుంచి కబ్జాల వరకు ఇరు వర్గాలు పర్సంటేజ్ లెక్కన పంచుకుంటున్నారని అన్నారు. అధికారంలో ఉన్నవారు 60 శాతం తీసుకుంటే, ప్రతిపక్షంలో కూర్చున్నవారికి 40 శాతం వాటా ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు.
జనసేన ప్రభుత్వం రాగానే...
ఎన్నికల శంఖారావంలో భాగంగా శుక్రవారం కర్నూలు జిల్లా ఆదోనిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. "రెండో ముంబైగా పేరున్న ఆదోని పారిశ్రామికీకరణలోనూ ముందుండేది. పత్తి కొనుగోలుకి కేంద్రంగా ఉన్న నేపథ్యంలో వందకు పైగా జిన్నింగ్ మిల్లులు ఉండేవి. పట్టణవాసులకి ఈ మిల్లులే జీవనాధారంగా ఉండేవి. కార్మిక సంఘాల్లో రాజకీయ జోక్యం మొదలు కావడంతో, ఒక్కో మిల్లు మూతపడుతూ వచ్చాయి. రాయలసీమ మిల్లు, కొఠారి మిల్లు, ఏటిఆర్ మిల్లులు మూతపడటంతో సుమారు 10 వేల కార్మిక కుటుంబాలు రోడ్డునపడ్డాయి. జనసేన ప్రభుత్వం రాగానే మూతపడ్డ జిన్నింగ్ మిల్లులను తెరిపిస్తుంది. చేనేత కళాకారుల జీవితాల్లో వెలుగులు నింపే దిశగా ప్రణాళికలు తీసుకొస్తాము. వారి కోసం ప్రత్యేక హ్యాండ్లూమ్ జోన్లు ఏర్పాటు చేస్తాం. తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేస్తాం. 59 ఏళ్లు నిండిన చేనేత కళాకారులకు రూ. 5వేలు పింఛన్ అందిస్తాం. ఆదోని ప్రాంతంలో టెక్స్ టైల్స్ పార్క్ ఏర్పాటు చేసి నేతలన్నలకు అండగా ఉంటాం"అని జనసేనాని తెలిపారు.
ఇంటర్మీడియట్ విద్యార్థులకు ల్యాప్ టాపులు
"ఆదోని డిగ్రీ కాలేజ్ గురించి గతంలో ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు ప్రశ్నిస్తే రాత్రికి రాత్రే డిగ్రీ కాలేజ్ మంజూరు చేశారు. జనసేన ప్రభుత్వం వస్తే ప్రతి మండలానికి డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీలు ఏర్పాటు చేస్తాం. ఇంటర్ చదువుకున్న విద్యార్ధులకు ఉచిత ల్యాప్ టాప్స్ అందిస్తాం. తుంగభద్ర డ్యామ్ నుంచి ఎల్ ఎల్ సీ కాలువ ద్వారా పూర్తి నీటి వాటా రావడం లేదు. జనసేన పార్టీ వచ్చాక దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న నదీజలాల పంపిణీ సమస్యలను రెండేళ్లలో పరిష్కరిస్తాం. ఇందుకోసం ముఖ్యమంత్రి చైర్మన్ గా ఉండేలా వాటర్ కమిషన్ ఏర్పాటు చేస్తాం. పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలను కేటాయిస్తాం. ఎస్పీ, ఎస్టీ, మైనార్టీల నుంచి యువ పారిశ్రామికవేత్తలను తయారు చేసేందుకు వెంచర్ క్యాపిటల్ ఫండ్ కింద రూ. 2 వేల కోట్లు కేటాయిస్తాం" అని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout