జనసేన కౌలు రైతు భరోసా యాత్ర: ఈ నెల 8న కర్నూలుకు పవన్.. అన్నదాతలకు ఆపన్నహస్తం
- IndiaGlitz, [Tuesday,May 03 2022]
ఆంధ్రప్రదేశ్‌లో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించేందుకు జనసేన పార్టీ ‘‘ కౌలు రైతు భరోసా యాత్ర’’ నిర్వహిస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జనసేన పార్టీ అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ ఇప్పటివరకు అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు సాయం అందించారు. ఈ యాత్రలో భాగంగా ఈ నెల 8న కర్నూలు జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టనున్నారు పవన్.
ఈ నెల 8న ఉదయం 9.30 గంటలకు పవన్ కల్యాణ్ కర్నూలు జిల్లా చేరుకుంటారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే శిరివెళ్ల మండల కేంద్రంలో జరిగే రచ్చబండ కార్యక్రమంలో కూడా పవన్ పాల్గొంటారని నాదెండ్ల మనోహర్ చెప్పారు. కాగా, తొలివిడతలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 130 కౌలు రైతు కుటుంబాలకు పవన్ కల్యాణ్ ఆర్థికసాయం అందించనున్నారు. మిగిలినవారికి రెండో విడతలో సాయం అందిస్తారు.
రాష్ట్రంలోనే అత్యధికంగా కర్నూలు జిల్లాలోనే కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని నాదెండ్ల మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 373 మంది కౌలు రైతులు గడిచిన మూడేళ్లలో బలవన్మరణాలకు పాల్పడ్డారని ఆయన తెలిపారు. వీరి కుటుంబాలకు న్యాయంగా ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారం ఇంకా అందలేదని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఇకపోతే.. ఏపీ మంత్రులు, వైసీపీ నేతలకు ఆయన గట్టి వార్నింగ్ ఇచ్చారు. తమ పార్టీ అధినేత పవన్‌పై చౌకబారు విమర్శలు మానుకోవాలని ఆయన సూచించారు. ప్రజలకు ఉఫయోగపడే పనులు చేయాలని నాదెండ్ల సూచించారు. రైతు భరోసా యాత్ర రైతులకు కొండంత నమ్మకాన్ని కలిగిస్తున్న విషయాన్ని వైసీపీ నేతలు గ్రహించాలని ఆయన హితవు పలికారు. పవన్ కల్యాణ్ రైతు భరోసా యాత్ర మొదలుపెట్టగానే అదరాబాదరగా రైతు కుటుంబాల్లో లక్ష రూపాయలు జమ చేస్తున్నారని నాదెండ్ల మనోహర్ దుయ్యబట్టారు.