మూడు రాజధానుల అంశంపై జనసేన కీలక నిర్ణయం..
- IndiaGlitz, [Monday,August 03 2020]
మూడు రాజధానుల అంశంపై జనసేన కీలక నిర్ణయం తీసుకుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజధాని రైతులకు అండగా నిలవాలని నిర్ణయించారు. నేడు జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమవేశంలో పలు అంశాలపై చర్చ జరిగింది. సమావేశానంతరం మీడియాకు ఆ పార్టీ ఓ ప్రకటనను విడుదల చేసింది. న్యాయపరంగా కూడా అమరావతికి మద్దతుగా పోరాడాలని జనసేన తీర్మానించింది. గతంలోనే తమ పార్టీ తదుపరి ప్రభుత్వం ఏది వచ్చినా రైతులకు అన్యాయం జరగకుండా చట్టం చేయాలని సూచించిందని పవన్ తెలిపారు. మూడు రాజధానుల నిర్ణయం ఏమాత్రం సబబు కాదని పవన్ అభిప్రాయపడ్డారు.
జగన్ మాట మార్చారు..
అమరావతిలో ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటానని ఎన్నికలప్పుడు చెప్పిన జగన్ రెడ్డి.. ఇప్పుడు మాట మార్చి ప్రజలను మోసం చేశారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణాలను పూర్తి చేయకుండా మధ్యలోనే నిలిపివేయడం టీడీపీ చేసిన అతిపెద్ద తప్పిదమని పవన్ అభిప్రాయపడ్డారు. నేడు జరుగుతున్న పరిణామాలకు టీడీపీయే బాధ్యత వహించాలన్నారు. సీఎం జగన్ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నారని పవన్ పేర్కొన్నారు. టీడీపీ, వైసీపీ రాజకీయాలకు రాజధాని రైతులను బలి చేయవద్దని ఈ సందర్భంగా సూచించారు.