అమరావతిలో పవన్‌కు 62 ఎకరాలపై జనసేన క్లారిటీ..
- IndiaGlitz, [Saturday,January 25 2020]
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అమరావతిలో 62 ఎకరాలు భూములు ఉన్నాయని.. అందుకే సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమం.. ఢిల్లీ బాట పట్టి హడావుడి చేస్తున్నారని కొందరు వైసీపీ నేతలు, విమర్శకులు సోషల్ మీడియా, మీడియా వేదికగా పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై ఎట్టకేలకు జనసేన స్పందించి క్లారిటీ ఇచ్చుకుంది. అంతేకాదు.. ఇలాంటి ప్రచారాలు చేస్తున్న వారికి నోటీసులు ఇస్తామని.. పరువు నష్టం దావా వేస్తున్నట్లు జనసేన ఓ ప్రకటన స్పష్టం చేసింది.
ఇదీ అసలు సంగతి..!
‘జనసేనను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక నీచ బుద్ధితో బురద చల్లడానికి కొందరు ప్రజా వ్యతిరేకులు కుట్రలు పన్ని తమ అనుచరగణంతో వాటిని అమలు చేస్తున్నారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని జనసేన చేస్తున్నప్రజా పోరాటానికి కోట్లాది గొంతులు తోడు ఉండటంతో.. ఎదురొడ్డి పోరాడలేని అల్పబుద్ధి గల వాళ్ళే.. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అమరావతి ప్రాంతంలో 62 ఎకరాల భూములు ఉన్నాయని, తప్పుడు పత్రాలు సృష్టించి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. ఇలా ప్రచారం చేస్తున్నవారిపైనా, సోషల్ మీడియాలోవక్ర రాతలు రాస్తున్నవారిపైనా న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన లీగల్ విభాగం నిర్ణయించింది. ఈ ప్రచారానికి కారకులైన వారిపై పరువు నష్టం దావా వేయనున్నాము. ఒకటి రెండు రోజులలో వారందరికీ లీగల్ నోటీసులు పంపుతాము’ అని జనసేన క్లారిటీ ఇచ్చింది.
మొత్తానికి చూస్తే గత రెండ్రోజులుగా నెలకొన్న హడావుడికి జనసేన స్పందిస్తూ పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టిందని చెప్పుకోవచ్చు. మరి ఈ ఆరోపణలు చేసిన వారు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే.