Pawan Kalyan:మీ తిట్లను స్వీకరిస్తా.. కానీ త్వరలోనే చేతల్లోనే సమాధానం చెబుతా : వైసీపీ నేతలకు పవన్ హెచ్చరిక
Send us your feedback to audioarticles@vaarta.com
తనపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. గురువారం ఆయన పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలో జనవాణి - జనసేన భరోసా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నాపై మీసం మెలిసే వైసీపీ నాయకులను పాకిస్థాన్ సరిహద్దులకు తీసుకెళ్లి అక్కడ మీసం మెలేయమని చెప్పాలని సెటైర్లు వేశారు. వైసీపీ నాయకుల కామెడీలకు నేను సమాధానం చెప్పనని పవన్ స్పష్టం చేశారు. తాను సినిమాల్లోనే మీసం మెలేయడం, తొడలు కొట్టడం వంటి వద్దని చెబుతానని ఆయన గుర్తుచేశారు. తాము ఎవరినీ వ్యక్తిగతంగా వెటకారం చేయడం లేదు.. మాటలు విసరడం లేదని ఓ పద్ధతిగా రాజకీయాలు చేయాలని జనసేన పార్టీ భావిస్తోందని పవన్ కల్యాణ్ తెలిపారు. రాష్ట్ర అభ్యున్నతి కోసం తాము కట్టుబడి ఉన్నామని.. వారు తిట్టే తిట్లను తాను సంతోషంగా తీసుకుంటాననని ఆయన పేర్కొన్నారు. వాళ్లు మాట్లాడే ప్రతి మాటకు సమాధానం చెప్పనని.. దానికి ఒకసారే చేతల్లోనే సమాధానం చెబుతానని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. వైసీపీ నాయకులు మాట్లాడే ప్రతి మాటను గుర్తుపెట్టుకొని తగిన విధంగా సమాధానం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆయన జోస్యం చెప్పారు.
బాధితుల దగ్గరే సమస్య తెలుసుకోవాలి:
అన్ని నియోజకవర్గాలు తిరిగి స్థానిక సమస్యలపై అవగాహన పెంచుకోవడమే ఈ యాత్ర ముఖ్యోద్దేశమన్నారు. సమస్య గురించి తెలుసుకోవడం కంటే నేరుగా బాధితుల దగ్గరకు వెళ్లి వారి ఆవేదన వింటే దానికి వచ్చే స్పందన వేరుగా ఉంటుందని పవన్ చెప్పారు. జనసేన పార్టీ జనవాణి కార్యక్రమం నిర్వహించడానికి ఒక యువతి ఆవేదనే కారణమని ఆయన గుర్తుచేసుకున్నారు. భద్రత పేరుతో తాడేపల్లిలో ముఖ్యమంత్రి నివాసానికి ఆనుకొని ఉన్న ఇళ్లను ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కూల్చేసిందని తెలిపారు. సరైన వసతి కల్పించకుండానే బాధితుల ఇళ్లు తొలగించారని.. ఈ విషయాన్ని వైసీపీ అభిమాని, ప్రభుత్వ వాలంటీర్ అయిన స్థానిక యువతి ఒకరు తన దృష్టికి తీసుకొచ్చిందని పవన్ చెప్పారు.
మార్కెట్‌కు వెళ్లిన వాడు.. శవమై తిరిగొచ్చాడు :
ఆమె ఫిర్యాదుపై తాను స్పందించడంతో వారం రోజుల తరువాత కొంతమంది వ్యక్తులు వాళ్ల అన్నయ్య మార్కెట్‌కు వెళ్తుండగా కిడ్నాప్ చేసి చంపేశారని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చనిపోవడానికి ముందు రోజు ఒంగోలులో ఉన్నానని చెప్పిన వ్యక్తి .. మరుసటి రోజు శవమై కనిపించాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కష్టం చెప్పుకుంటే ఈ ప్రభుత్వం చంపేసిందని.. ఆమె కార్చిన కన్నీరే జనవాణి కార్యక్రమం పెట్టడానికి కారణమైందని పవన్ కళ్యాణ్ తెలిపారు. కరోనా సమయంలో మాస్కులు లేవన్నందుకు డాక్టర్ సుధాకర్‌ను చనిపోయేలా చేశారని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నించిన ఓ తల్లిని మానసిక స్థితి బాగోలేదని నింద వేసి కాకినాడ ఆస్పత్రిలో పడేశారని పవన్ మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వ్యవస్థలను వాడుకొని భయపెట్టడం ఆవేదన కలిగించిందన్నారు. చైతన్యవంతులైన ప్రజలు స్పందించకపోతే అరాచకం రాజ్యమేలుతుందని ఆయన హెచ్చరించారు.
ప్రతి సమస్యా పరిష్కారమయ్యేలా చూస్తా:
ఇవాళ జరిగిన జనవాణి కార్యక్రమంలో పంట కాలువలు, రిజర్వాయర్ ఆధునికీకరణ సమస్యలు, మట్టి మాఫియా ఆగడాలు, మత్స్యకార సమస్యలు, రెల్లి కార్మికుల సమస్యలు ఇలా దాదాపు 34 అర్జీలు వచ్చాయన్నారు. యువత ఉద్యోగ అవకాశాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పవన్ తెలిపారు. కర్ణాటకలో దాదాపు 2 వేలకు పైగా సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉంటే హైదరాబాద్ లో 1500కు పైగా కంపెనీలు ఉన్నాయిని యువత చెబుతోందన్నారు. ఇదే సమయంలో మన రాష్ట్రంలో 100 కంపెనీలు కూడా లేవని చెబుతున్నారని పవన్ తెలిపారు. వర్క్ ఫ్రం హోమ్ చేద్దామంటే తమకు వచ్చే జీతాలు కంటే కరెంటు బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారని జనసేనాని వెల్లడించారు. జనవాణికి వచ్చిన ప్రతి పిటిషన్‌ను అధ్యయనం చేస్తామని.. సంబంధిత ప్రభుత్వ శాఖలకు పంపించి సమస్యకు పరిష్కారం లభించేలా ప్రయత్నం చేస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments