Pawan Kalyan : ఎన్నికల యుద్ధానికి పవన్ ‘‘వారాహి’’ సిద్ధం... ఎన్ని ప్రత్యేకతలో.. !!
Send us your feedback to audioarticles@vaarta.com
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికలపై సీరియస్‌గా దృష్టి పెట్టారు. ఇప్పటికే కౌలు రైతు భరోసా యాత్రతో పాటు జనవాణి కార్యక్రమాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ ఏడాది దసరా నాడు రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించాలని పవన్ భావించినా అనివార్య కారణాలతో వాయిదా పడుతోంది. అయితే ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం వుండటంతో ఆయన జాగ్రత్త పడుతున్నారు. షూటింగ్ విరామ సమయాల్లో రాష్ట్రంలోని ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. చేతిలో వున్న సినిమాలను వేగంగా కంప్లీట్ చేసి పూర్తి సమయం రాజకీయాలకే కేటాయించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు.
ఎన్నికల యుద్ధానికి సిద్ధమన్న పవన్:
ఈ క్రమంలో ఈసారి మాత్రం ఎట్టి పరిస్ధితుల్లోనూ బస్సు యాత్ర నిర్వహించాలని పవన్ కల్యాణ్ గట్టిగా ఫిక్స్ అయ్యారు. దీనికి సంబంధించి తన అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా బస్సును తయారు చేయించారు. దీనికి ‘వారాహి’ అనే పేరు పెట్టారు. చూడటానికి అచ్చుగుద్దినట్లు ఆర్మీ వెహికల్ మాదిరిగా వున్న బస్సును పవన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఎన్నికల యుద్ధానికి వారాహి సిద్ధం అంటూ ఆయన క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం పవన్ ప్రచార రథం ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వారాహి ప్రత్యేకతలివే :
ఇక పవన్ రిలీజ్ చేసిన వీడియోలో ‘‘వారాహి’’కి నలువైపులా బాడీగార్డ్స్ సైనికుల మాదిరిగా నడుచుకుంటూ వస్తున్నారు. ఇక ఈ వాహనంలోని సదుపాయాల విషయానికి వస్తే.. ఇటీవల వైజాగ్‌లో వీధి దీపాలను ఆర్పి వేసి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిన నేపథ్యంలో ఈ వాహనంపై ప్రత్యేక లైటింగ్ ఏర్పాట్లు చేశారు. అలాగే పవన్ సభలకు హాజరయ్యే వేలాది మందికి ఆయన ప్రసంగం వినిపించే విధంగా అత్యాధునిక సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. దీనితో పాటు వారాహి వాహనం చుట్టూ సీసీ కెమెరాలు అమర్చారు. వాహనం ప్రయాణించే మార్గంలో రికార్డ్ అయ్యే ఫుటేజ్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సర్వర్‌గా అనుసంధానం చేశారు. లోపల పవన్‌తో పాటు మరొకరు కూర్చొని చర్చించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. లోపలి నుంచి వాహనం పై భాగంలోకి వెళ్లేందుకు హైడ్రాలిక్ స్టెప్స్ వున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments