Pawan Kalyan:జనసేనానికి విజయోస్తు : ఘనంగా మొదలైన పవన్ వారాహి విజయ యాత్ర .. జనసంద్రమైన కత్తిపూడి

  • IndiaGlitz, [Thursday,June 15 2023]

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తలపెట్టిన వారాహి విజయ యాత్ర ఘనంగా ప్రారంభమైంది. బుధవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో శ్రీ సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న పవన్ .. వారాహి యాత్రకు శ్రీకారం చుట్టారు. వారాహి విజయ యాత్రలో పాలు పంచుకునేందుకు తరలివచ్చిన ఆశేషజన వాహిని అన్నవరం - కత్తిపూడి మధ్య జాతీయ రహదారిని ముంచెత్తడంతో వారాహి రథాన్ని కత్తిపూడి సభా ప్రాంగణానికి ముందుగానే పంపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనంతరం పవన్ కళ్యాణ్ అన్నవరం నుంచి భారీ ర్యాలీగా కత్తిపూడికి బయలుదేరారు.

అన్ని దారులు కత్తిపూడి వైపే :

కత్తిపూడి బయలుదేరేందుకు రత్నగిరి నుంచి కిందికి దిగిన జనసేనానికి జన సైనికులు, వీర మహిళలు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆడపడుచులు హారతులు పట్టి ఆహ్వానం పలుకగా.. అన్నవరం నుంచి కత్తిపూడి వరకు వందలాది బైకులు, కార్లతో పవన్‌ను అనుసరించారు. జాతీయ రహదారికి ఇరువైపులా బారులు తీరిన జనసైనికులు దారి పొడుగునా పార్టీ జెండాలు రెపరెపలాడిస్తూ ఆయనకు స్వాగతం పలికారు. అన్నవరం నుంచి కత్తిపూడి వరకు రహదారి మొత్తం జనసేన శ్రేణులు ఏర్పాటు చేసిన భారీ కటౌట్లు, బ్యానర్లతో నిండిపోయింది. పవన్ వారాహి యాత్రకు మద్దతుగా బుధవారం ఉదయం నుంచే రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో జనసేన శ్రేణులు అన్నవరం చేరుకున్నాయి.

అభిమానుల ప్రేమకు పవన్ ఫిదా :

వారాహి రథాన్ని అధిరోహించడానికి వచ్చిన పవన్ కళ్యాణ్‌కు కత్తిపూడి సభా ప్రాంగణం వద్ద సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. పార్టీ అధినేత రాకకు సూచకంగా పెద్ద ఎత్తున బాణసంచా పేల్చారు. కత్తిపూడి ఫ్లైఓవర్ నుంచి అభిమానులు కురిపించిన పూల వర్షంలో పవన్ కల్యాణ్ తడిసి ముద్దయ్యారు. మధ్యాహ్నం నుంచే వేదిక వద్ద మోత మోగించిన కేరళా డప్పు, నృత్య కళాకారులు జనసేనానిని ఆహ్వానించారు. అనంతరం అచ్చ తెలుగు సంప్రదాయంలో మంగళవాద్యాల నడుమ సుమారు 50 మంది ఆడపడుచులు గుమ్మడి కాయలతో హారతులు పట్టి పవన్ కళ్యాణ్‌కు దిష్టి తీసి వారాహి వైపు దారి చూపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కదిలిన జనసేనానికి శుభం కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఆడపడుచుల ఆత్మీయ స్వాగతాన్ని స్వీకరించిన ఆయన వేలాది మంది జనసైనికుల కేరింతల మధ్య వారాహి రథాన్ని అధిరోహించారు. పవన్ కళ్యాణ్ వెంట పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ , ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నేతలతోపాటు రాష్ట్రం నలుమూలల నుంచి వివిధ జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, నియోజవకర్గాల ఇంఛార్జులు, రాష్ట్ర, జిల్లాల కార్యవర్గ సభ్యులు తరలి వచ్చి జనసేన వారాహి విజయయాత్ర తొలి అడుగు ఘనంగా వేసేలా తమ వంతు కృషి చేశారు.