Pawan Kalyan:మహిళల అదృశ్యంపై కేంద్రం ప్రకటన .. పవన్‌కు దొరికిపోయిన జగన్ , బాధ్యత ఎవరిదంటూ ఘాటు వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించిన వారాహి విజయ యాత్ర సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 30 వేలకు పైగా మహిళలు అదృశ్యమయ్యారని పవన్ వ్యాఖ్యానించారు. కొందరు వాలంటీర్ల నుంచి మహిళలకు సంబంధించిన సమాచారం సంఘ విద్రోహ శక్తులకు చేరుతోందని.. ఈ క్రమంలోనే ఆడబిడ్డలు అదృశ్యమవుతున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై వాలంటర్లు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు నిర్వహించగా.. ప్రభుత్వం సైతం ఆయనపై పరువు నష్టం దావా వేసేందుకు నిర్ణయించింది. అయితే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా ఏపీలో 30,196 మంది ఆడపిల్లలు అదృశ్యమైనట్లుగా కేంద్రం స్వయంగా పార్లమెంట్లో ప్రకటన చేయడం కలకల రేపింది.
మహిళల అదృశ్యంపై కేంద్రం ప్రకటన :
ఆ వెంటనే పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో 2019 నుంచి 2021 వరకు ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం 30,196 మంది మహిళలు, బాలికలు అదృశ్యమయ్యారని చెప్పారని పవన్ తెలిపారు. 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికలు 7918 మంది , 18 ఏళ్లు పైబడిన మహిళలు 22,278 మంది అదృశ్యమయ్యారని జనసేనాని వెల్లడించారు.
వైసీపీ ప్రభుత్వాన్ని ఏపీ మహిళా కమీషన్ ప్రశ్నిస్తుందా :
ఈ గణాంకాలను నిశితంగా పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో తప్పిపోయిన బాలికలు, మహిళల సంఖ్య పెరుగుతున్న ధోరణిలో ఉందన్నారు. మన అమ్మాయిలు, మహిళలు ఎందుకు తప్పిపోయారు..? వారికి ఏమి జరుగుతోంది..? ఎవరు బాధ్యత తీసుకుంటారు..? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. దీనిపై ఏపీ మహిళా కమిషన్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి బహిరంగంగా మాట్లాడుతుందా..? ఏపీ మహిళా కమిషన్.. హోం శాఖ, డీజీపీని వివరణ కోరుతుందా..? వైసీపీ ప్రభుత్వాన్ని ఏపీ మహిళా కమిషన్ ప్రశ్నిస్తుందా..? అంటూ పవన్ కల్యాణ్ దుయ్యబట్టారు. ఈ అంశంపై హోంమంత్రి, డీజీపీ స్పందించాలని జనసేన డిమాండ్ చేస్తోందని ఆయన ట్వీట్ చేశారు.
జగన్ సర్కార్ ఇప్పుడేం చెబుతుంది : నాదెండ్ల మనోహర్
ఆంధ్రప్రదేశ్‌లో మహిళల అదృశ్యంపై కేంద్రం చేసిన ప్రకటనపై స్పందించారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా ఇచ్చిన సమాచారాన్ని వైసీపీ పెద్దలు చదువుకోవాలని దుయ్యబట్టారు. 2019 నుంచి 2021 మధ్యకాలంలో 30 వేల మందికి పైగా మహిళలు, బాలికలు అదృశ్యమయ్యారని తమ అధినేత చెప్పారని నాదెండ్ల ఎద్దేవా చేశారు. ఆయన మాటలపై మంత్రులు, పోలీసులు అర్ధంపర్థం లేని వ్యాఖ్యలు చేశారని.. ఫ్యాక్ట్ చెక్ పేరుతో తప్పుడు లెక్కలు చూపించి మసి పూసి మారేడు కాయ చేసిన అధికార యంత్రాంగం కేంద్ర హోమ్ శాఖ పార్లమెంట్‌కు ఇచ్చిన సమాచారంతో ఇప్పుడు ఏం చెబుతారని ఆయన ప్రశ్నించారు.
కేంద్ర లెక్కల్ని కూడా ఫ్యాక్ట్ చెక్ చేస్తారా : నాదెండ్ల
కేంద్ర హోంశాఖ ఇచ్చిన గణాంకాలను కూడా జగన్ ప్రభుత్వం తప్పుబడుతుందా.. ఆ లెక్కలను కూడా ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఏమైనా చెబుతుందా అని నాదెండ్ల నిలదీశారు. మహిళలు, బాలికల అదృశ్యం సమస్యను పవన్ గ్రహించారు కాబట్టే గణాంకాల ఆధారంగా తెలియజేశారని నాదెండ్ల మనోహర్ అన్నారు. కానీ జగన్ ప్రభుత్వం వాస్తవాలు గ్రహించలేని స్థితిలో వుందని.. అందుకే పవన్‌పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తూ సభ్యత మరచిపోయి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇకనైనా వైసీపీ ప్రభుత్వం బాలికలు, మహిళల రక్షణపై దృష్టి పెడితే మంచిదని నాదెండ్ల మనోహర్ హితవు పలికారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout