Pawan Kalyan : కదనరంగంలోకి వారాహి... అంజన్న ఆశీస్సుల కోసం కొండగట్టుకి పవన్ కల్యాణ్

  • IndiaGlitz, [Tuesday,January 17 2023]

వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాల టూర్లు చేస్తుండగా, ఆ పార్టీ యువనేత నారా లోకేష్ యువగళం పేరుతో సుదీర్ఘ పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ క్రమంలో పవన్ కూడా అప్రమత్తమయ్యారు. దీనిలో భాగంగా ఈ నెల 24న తెలంగాణలోని కొండగట్టు, ధర్మపరిలలో పర్యటించనున్నారు. తన పర్యటనల నిమిత్తం తయారు చేయించిన వారాహి వాహనానికి పూజలు నిర్వహించనున్నారు. తొలుత కొండగట్టులో ఆంజనేయస్వామిని దర్శించుకుని, అక్కడి నుంచి ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా అనుష్టుప్ నారసింహ యాత్ర (32 నారసింహ క్షేత్రాల సందర్శన)కు పవన్ కల్యాన్ శ్రీకారం చుట్టనున్నారు.

ఒంటరిగా వెళ్లి వీరమరణాలొద్దన్న పవన్ :

ఇదిలావుండగా.. వచ్చే ఏపీ ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాన్ ఒంటరిగా పోటీ చేస్తారా లేక టీడీపీతో పొత్తుతో వెళ్తారా అన్న దానిపై గత కొన్నిరోజులుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేనాని భేటీ కావడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా రణస్థలం గత గురువారం జరిగిన యువశక్తి బహిరంగ సభలో పొత్తుకు సంబంధించి పవన్ క్లారిటీ ఇచ్చారు. ఒంటరిగా వెళ్లి వీరమరణం పొందడం అవసరం లేదని.. తన గౌరవం తగ్గకుంటడా వుంటే పొత్తుల్లో ముందుకే వెళ్తానని ఆయన స్పష్టం చేశారు. కుదరని పక్షంలో ఒంటరిగానే పోటీ చేస్తానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఒంటరిగా వెళ్లే ధైర్యం ఇస్తే ఖచ్చితంగా అలాగే బరిలోకి దిగుతానని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు నా వెంటే వున్నామని అంటారని.. తీరా ఎన్నికల సమయానికి కులమని, మతమని, అమ్మ, నాన్న చెప్పారని ఓటు వేరేవారికి వేస్తారని పవన్ తన అభిమానులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

హింసించే వ్యక్తిని ఎదుర్కోవాలంటే అందరూ కలవాల్సిందే:

గత ఎన్నికల్లో 53 నియోజకవర్గాల్లో వైసీపీ టెక్నికల్‌గానే గెలిచిందని.. జనసేనకు అప్పట్లో 7 శాతం వరకు ఓట్లు పడ్డాయని పవన్ తెలిపారు. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనని.. తనకు రాష్ట్రం బాగుండటమే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం మంచి పాలన అందించి వుంటే తాను గొంతెత్తేవాడిని కాదని, కానీ బాధపెడుతుంటే ఖచ్చితంగా ఎదురు తిరుగుతామని పవన్ పేర్కొన్నారు. గతంలో టీడీపీని తిట్టి.. ఇప్పుడు మళ్లీ కలుస్తారా అని కొందరు అంటున్నారని.. కానీ ఒక హింసించే వ్యక్తిని ఎదుర్కోవాలంటే అందరు కలవాలని ఆయన అన్నారు.